Begin typing your search above and press return to search.

టీడీపీకి దెబ్బ మీద దెబ్బ‌... పార్టీకి అవంతి గుడ్‌ బై ?

By:  Tupaki Desk   |   13 Feb 2019 12:07 PM GMT
టీడీపీకి దెబ్బ మీద దెబ్బ‌... పార్టీకి అవంతి గుడ్‌ బై ?
X
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఎన్నిక‌ల‌కు గ‌డువు త‌రుముకువ‌స్తున్న వేళ‌... పార్టీకి చెందిన కీల‌క నేత‌లు ఒకరి వెనుక మ‌రొక‌రుగా రాజీనామాలు చేస్తుండ‌టంతో పాటుగా నేరుగా విప‌క్ష వైసీపీలోకి చేరుతుంటడం నిజంగానే చంద్ర‌బాబుకు పెద్ద దెబ్బేన‌ని చెప్ప‌క తప్ప‌దు. నేటి ఉద‌యం ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీకి రాజీనామా చేసి నేరుగా వైసీపీలోకి చేరిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ వార్త ద్వారా త‌గిలిన షాక్ నుంచి ఇంకా తేరుకోక‌ముందే... టీడీపీకి మరో షాక్ త‌గిలింద‌నే వార్త‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, అనకాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు (అవంతి శ్రీ‌నివాస్‌) టీడీపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోనే ఆయ‌న చేర‌నున్నార‌న్న దిశ‌గా వెలువ‌డుతున్న వార్తలు చంద్రబాబుకు బీపీని పెంచేస్తున్నాయ‌ని చెప్పాలి. ఒక ఢిల్లీ దీక్షతో త‌న‌కు తానే హీరో అయిపోయాన‌నుకుంటున్న బాబుకు ఈ ప‌రిణామాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. టీడీపికి ప్ల‌స్ గా భావిస్తున్న వాళ్లుఒకరి త‌ర్వాత ఒక‌రు పార్టీని వీడితే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మెలా? ఎలాగోలా పోటీ చేసిన విజ‌యం సాధించేదెలా? అన్న దిశ‌గా చంద్ర‌బాబు త‌ల పట్టుకోక త‌ప్ప‌ద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

అయినా అవంతి టీడీపీని వీడే ఆలోచ‌న చేయ‌డానికి గ‌ల కార‌ణాలు ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అవంతి... ప్ర‌స్తుతం మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓ ద‌ఫా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ నేత‌లంతా అటు టీడీపీలోనో, ఇటు వైసీపీలోనో చేరిపోయారు. గంటాకు ముఖ్య అనుచ‌రుడిగా ముద్ర‌ప‌డ్డ అవంతి... గంటాతో పాటు టీడీపీలో చేరారు. నాడు భీమిలి నుంచి గంటా బ‌రిలోకి దిగ‌గా.... చేసేదేమీ లేక అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు నుంచి అవంతి పోటీ చేశారు. ఇద్ద‌రూ గెలిచారు. అయితే గ‌డ‌చిన ఐదేళ్ల‌లో గంటాకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌గా... అవంతికి పార్టీలో పెద్ద‌గా ప్రాధాన్య‌మే ద‌క్క‌లేదు.

ఈ క్ర‌మంలో గ‌త కొంత‌కాలంగా గ‌ళం విప్పిన అవంతి... ఈ ద‌ఫా తాను త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం భీమిలి నుంచి పోటీ చేస్తాన‌ని చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న పార్టీ అధిష్ఠానానికి చేర‌వేశారు. అయితే ఈ ద‌ఫా కూడా తాను భీమిలి నుంచే పోటీ చేస్తాన‌ని గంటా తేల్చి చెప్ప‌డంతో అవంతి ప్ర‌తిపాద‌న‌ను చంద్ర‌బాబు ప‌క్క‌న‌పెట్టేశారు. ఈ నేప‌థ్యంలో త‌న భ‌విష్య‌త్తుపై అవంతి పుప‌న‌రాలోచ‌నలో ప‌డ్డార‌ట‌. టీడీపీలో ఉంటే గెలిచినా నా ప‌రిస్థితి ఇంతే కదా అన్న భావ‌న‌లో ఉన్నార‌ట ఆయ‌న‌. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఎలాగూ పార్టీ గాలి లేనపుడు పైగా ప్రాధాన్యం లేన‌పుడు ఎందుకు ఇక్క‌డ అనే భావ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు అవంతి వ‌ర్గాలు ఈ వార్త‌ను క‌న్‌ఫం చేయ‌లేదు. కాక‌పోతో అన్న‌లో అసంతృప్తి ఉన్న‌మాట నిజ‌మే అంటున్నారు. మ‌రి రేపోమాపో అవంతి మీడియా ముందుకు వ‌చ్చి చెబుతారా? అది జ‌రిగితే చంద్ర‌బాబు ఎలా బుజ్జ‌గిస్తారు? ఇంత‌కాలం ప‌ట్టించుకోకుండా ఇపుడు ప‌ట్టించుకుంటే అవంతి ఉండిపోతారా? వ‌ంటివి ఇపుడు స‌మాధానం తెలియాల్సిన ప్ర‌శ్నలు.