Begin typing your search above and press return to search.

చిరు కోసం పోటా పోటీ... ?

By:  Tupaki Desk   |   13 Jan 2022 7:45 AM GMT
చిరు కోసం పోటా పోటీ... ?
X
మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకున్న వారు. ఆయన యువతరానికి స్పూర్తిదాయం. ఆయన ఒక్కో మెట్టూ ఎక్కి కష్టపడి పైకి వచ్చారు. ఆయన ఈ రోజు అనుభవిస్తున్న మెగా స్టార్ స్టాటస్ ఆయన చమట కష్టం తప్ప ఎవరిదో కాదు, ఏ ఘనమైన వారసత్వమో అంతకంటే కాదు, అందుకే చిరంజీవి ఎపుడూ ఒదిగే ఉంటారు. ఒక్క మాట కూడా తూలరు. ఆయన ఎంతటి సంస్కారవంతుడు అంటే తనను ఎన్నో మాటలు అన్న వాళ్ళను కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా క్షమించి వదిలేసేటంత.

ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాల్లో మళ్లీ చిరంజీవి పేరు నానుతోంది. చిరంజీవి పార్టీ పెట్టడం వల్లనే తాను ఓడానని ఈ మధ్యనే సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు హాట్ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో ఎంతో పండిపోయాను అని చెబుతున్న చంద్రబాబు ఇప్పటికీ చిరంజీవి వల్లనే తనకు అధికార పళ్ళెం నోటి దాకా వచ్చి పోయింది అన్న బాధ దుగ్ద ఎక్కడా పోలేదు అనడానికే ఈ తాజా వ్యాఖ్యలు.

అసలు ఇంతకీ చెప్పుకోవాల్సింది చూస్తే మన విజయాలను మరో పార్టీ ఆపడమేంటి, మనకు జనాలు మద్దతుగా ఉంటే మధ్యలో ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఓటు మనదే అవుతుంది కదా. అయినా ప్రజాస్వామ్యంలో వేరే ఎవరూ పార్టీ పెట్టకూడదని, పుట్టకూడదని భావించడమేంటి. అదే సమయంలో ఎంతసేపూ తనకే అధికారం ఉండాలన్న ఆ అహంకారమేంటి. ఇవన్నీ కూడా వరసబెట్టి వస్తున్న ప్రశ్నలే.

ఇదిలా ఉంటే చిరంజీవి వల్లనే ఓడిపోయాను అని చెబుతున్న చంద్రబాబు తనకు ఆయన నాడూ నేడూ స్నేహితుడే అని మళ్ళీ అంటున్నారు. దానికి కారణం చిరంజీవి చరిష్మా. ఆయన బలమైన సామాజికవర్గానికి చెందిన వారు కావడం. ఆయన తమ్ముడు పవన్ పార్టీతో జట్టు కట్టాలన్న ఆరాటం ఉండడం. సరే చిరంజీవి ఏనాడో ఈ రకమైన కామెంట్స్ కి జవాబు చెప్పే స్థితి నుంచి ఎదిగిపోయారు. ఆయన తన సినిమాలూ తానూ అన్నట్లుగానే ఉన్నారు. ఇండస్ట్రీ పాలిటిక్స్ కి కూడా దండం అంటూ ఆయన మా ఎన్నికల తరువాత అలాగే ఉంటూ వస్తున్నారు.

అయినా చిరంజీవి ఫ్యాక్టర్ ని ఎన్నికల్లో వాడుకోవాలన్న తాపత్రయం మాత్రం ఏపీ రాజకీయాల్లో ఉన్న వారికి పోలేదు. చిరంజీవి నా ఆత్మీయుడు అని చంద్రబాబు అని కొద్ది రోజులు గడిచాయో లేదో ఆయన్ని ఏకంగా లంచ్ మీట్ కి జగన్ ఆహ్వానించేశారు. నిజానికి సినిమా రంగానికి సంబంధించి సమస్యల మీద చిరంజీవితో ఇప్పటికి రెండు సార్లు జగన్ భేటీ అయ్యారు. అంతకు ముందు ఆయన చిరంజీవి దంపతులకు జగన్ దంపతులు విందు ఇచ్చి గౌరవించారు కూడా.

ఇవన్నీ ఇలా ఉండగానే ఇపుడు జగన్ చిరంజీవిని మళ్ళీ లంచ్ కి పిలవడం అంటే దీని వెనక సినిమా అంశాలే కాకుండా రాజకీయం కూడా ఉంది అంటున్న వారూ ఉన్నారు. చిరంజీవికి రాజకీయాలు అవసరం లేదు కానీ ఆయనను పక్కన పెట్టుకుని తమ రాజకీయాలు జరుపుకునే వారు ఉండడం వల్లనే ఆయన మళ్ళీ ఫోకస్ అవుతున్నారు. జగన్ తో చిరంజీవి భేటీ ద్వారా తమ్ముడు అటు వైపు ఉన్నా అన్న మా వైపే అని వైసీపీ పెద్దలు చాటనున్నారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.

సరే ఎవరేమనుకున్నా చిరంజీవి మాత్రం రాజకీయాలకు దూరం. ఆయన అందరివాడు. ఆయనకు చంద్రబాబు అయినా జగన్ అయినా ఇద్దరూ సమానులే. పైగా ఆయనకు ఎవరి మీద ప్రత్యేకమైన ద్వేషాలు అంతకంటే లేవు. కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం చిరు మావాడు అంటే మావాడు అనుకుంటూ ఎత్తులు పై ఎత్తులు వేసే పాలిటిక్స్ మాత్రం జోరుగా సాగుతోంది అనే చెప్పాలి.