Begin typing your search above and press return to search.

పక్కింట్లోకి తొంగి చూసే అలవాటు మానరా అంబటి?

By:  Tupaki Desk   |   12 Oct 2022 10:35 AM IST
పక్కింట్లోకి తొంగి చూసే అలవాటు మానరా అంబటి?
X
గతంలో కనిపించని కొత్త తరహా రాజకీయాలు ఈ మధ్యన రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఈ పరిస్థితి మరింత తేడాగా ఉంది. ఏపీ అధికారపక్ష నేతలు.. వారిలో కొందరు లేవనెత్తే వాదనలు వింటే కూసింత ఆశ్చర్యపోవాల్సిందే.

తాము చేయాల్సిన పనుల గురించి వివరాలు చెప్పటం పక్కన పెట్టి.. తమ ప్రత్యర్థులు ఏమేం నిర్ణయాలు తీసుకుంటారన్న విషయాల గురించి ప్రశ్నలు అడిగే తీరు చూస్తే.. ఇంట్లో విషయాల్ని వదిలేసి.. నిత్యం పక్కింటి వైపు కన్ను వేసే సగటు జీవి ఏపీ మంత్రి అంబటి రాంబాబులో కనిపిస్తారన్న మాట వినిపిస్తోంది.

తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే దీనికి నిదర్శనంగా చెప్పాలి. ఏపీ అధికారపక్షంపై పవన్ కల్యాణ్ చేస్తున్న ఘాటు విమర్శలు.. పంచ్ ట్వీట్లు అధికార పార్టీలో కలకలాన్ని రేపుతున్నాయి. గురి పెట్టి విడిచి బాణంలా దూసుకుపోతే.. వాటిని ఎదుర్కొనేందుకు తమ వద్ద ఉన్న ఆయుధాలు సరిపోని వేళ.. అంబటి లాంటి వాళ్లు తమకు అలవాటైన మోటు.. మెరటు పద్దతుల్ని బయటకు తీస్తున్నారు.

తెలివి అంతా తమకు మాత్రమే సొంతమన్నట్లుగా వారి తీరు ఉంటోంది. పవన్ ను ప్రశ్నించేందుకు అడ్డదిడ్డమైన వాదనల్ని తెర మీదకు తెచ్చే వైసీపీ నేతలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అంబటి తాజా ప్రశ్నలు ఉన్నాయి. జనసేన వీర మహిళకు నమస్కారం.. బాబుని అందలం ఎక్కించాలనా? కల్యాణ్ బాబును ముఖ్యమంత్రిని చేయాలనా? ఏమిటి మీ ప్రయత్నం? వివరంగా వివరించగలరా? అంటూ అంబటి ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలపై మండిపాటు వ్యక్తమవుతోంది.

తామేం చేస్తామన్న విషయాన్ని ఎందుకు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అయినా.. అంబటిలాంటి వారు మంత్రులుగా ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి అప్పచెప్పిన శాఖల మీద పట్టు తెచ్చుకొని పాలనలో దూసుకెళ్లేలా చేయాల్సిన అంశాల్ని వదిలేసి.. 2024లో జరిగే ఎన్నికల ముచ్చట్లు.. అప్పుడు విజయం సాధిస్తే ఎవరు సీఎం అవ్వాలనే దాని గురించి ఇప్పటి నుంచే ప్రశ్నల్ని సంధిస్తున్న వైనంపై మండిపాటు వ్యక్తమవుతోంది.

తమ ప్రయత్నాలు.. తమ ఇంటి విషయాల్ని అంబటి లాంటి వారికి ఎందుకు చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. పక్కింటి వైపు అదే పనిగా చూసే అంబటి లాంటి వారికి ఇంటి విషయాలు వీర మహిళలు కానీ జనసేన వారు కానీ ఎందుకు చెబుతారు?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.