Begin typing your search above and press return to search.

సజ్జన్నార్ చేతుల మీదుగా ఆర్టీసీకి సర్జరీ

By:  Tupaki Desk   |   1 Sept 2021 6:00 PM IST
సజ్జన్నార్ చేతుల మీదుగా ఆర్టీసీకి సర్జరీ
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. రాష్ట్రంలో బోలెడంతమంది ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఉండటం.. ఎవరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు వారికి ఇవ్వాల్సి ఉన్న వేళ.. అందుకు భిన్నంగా కొన్ని కాంబనేషన్లను సెట్ చేయటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమేమో? తెలంగాణ ప్రభుత్వాన్ని తొలిసారి కొలువు తీర్చిన వేళ.. అవినీతిమయంగా మారిన పౌరసరఫరాల శాఖ లెక్క తేల్చేందుకు వీలుగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ను కీలక బాధ్యతలు అప్పజెప్పటం.. కేసీఆర్ అంచనాలకు తగ్గట్లే.. దాని లెక్కను సరిచేసినట్లు చెబుతారు.

పౌరసరఫరాల శాఖ బాధ్యతల్ని చేపట్టిన సీవీ ఆనంద్.. తక్కువ కాలంలోనే బండిని దారిలోకి తీసుకురావటమే కాదు.. అవినీతి మరకను చాలావరకు తుడిపే ప్రయత్నం చేశారని చెబుతారు. కీలకమైన కొన్ని టాస్కుల్ని పోలీసు బాస్ లకు అప్పజెప్పటం ద్వారా.. అన్ని విధాలుగా కంట్రోల్ చేయటానికి వీలుంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే.. ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి.. తన పేరుతోనే ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్న సజ్జన్నార్ చేతికి ఆర్టీసీ పగ్గాల్ని అప్పజెబుతూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

దీనికి కారణం ఏమిటి? సజ్జన్నార్ లాంటి సమర్థుడైన అధికారి చేతికి ఆర్టీసీ పగ్గాలు ఇవ్వటం ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానం ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయిన టీఎస్ఆర్టీసీని గట్టెక్కించేందుకు.. ప్రభుత్వం అనుకుంటున్న సంస్కరణల్ని ప్రవేశ పెట్టటం కోసమే ఆయన్ను ప్రత్యేకంగా అపాయింట్ చేసినట్లుగా చెబుతారు. ఆదాయం తగ్గటం.. ఖర్చులు పెరగటం.. డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో టికెట్ ఛార్జీలు పెంచినప్పటికి.. పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం తక్కువగా ఉందని చెబుతారు. అలా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ ఛార్జీలు పెంచలేని దుస్థితి.

మరి.. సజ్జన్నార్ కు బాద్యతల్ని ఎందుకు అప్పజెప్పినట్లు? అన్న ప్రశ్నకు కొందరు చెబుతున్న దాని ప్రకారం.. ఆర్టీసీలో పెద్ద ఎత్తున వీఆర్ఎస్ తీసుకునేలా చేయాలని ప్రభుత్వంభావిస్తున్నట్లు చెబుతున్నారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ.. తప్పనిసరి ఉద్యోగవిరమణ (సీఆర్ఎస్) ద్వారా దగ్గర దగ్గర 17వేల మందిని ఉద్యోగుల్నివిజయవంతంగా ఇంటికి పంపించటమే లక్ష్యమని చెబుతున్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ కోసమే సజ్జన్నార్ ను నియమించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ కింద బస్సులు తక్కువ.. కార్మికులు ఎక్కువగా ఉండటం.. వీరి వల్ల ఖర్చుల భారం తీవ్రంగా పెరిగిపోతున్నట్లు చెబుతున్నారు.

అందుకే దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు వీలుగా.. వివిధ స్థాయిల్లో అదనంగా ఉన్న ఉద్యోగుల్ని విజయవంతంగా ఇంటిబాట పట్టించే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 49,250 మంది ఉద్యోగులు వివిధ స్థాయిల్లో పని చేస్తున్నారు. వీరిలో 18వేల మంది వరకు డ్రైవర్లే ఉన్నారు. 20వేల కండక్టర్లు ఉన్నారు. కాలం చెల్లిన కారణంగా ఈ మధ్య కాలంలో ఉన్న 9,184 బస్సుల్లో 3250 బస్సుల్ని తీసేసింది. ఆ బస్సుల్లో పని చేయాల్సిన వారంతాఇప్పుడు పని లేకుండా ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా అదనంగా ఉన్న వారిని ఇంటికి పంపించేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. మరి.. దీనిపై సజ్జన్నార్ మార్కు ఏ రీతిలో ఉంటుందో చూడాలి.