Begin typing your search above and press return to search.

హైకర్టు లో ఆర్టీసీ భవితవ్యం..ఏంచెప్పబోతుందంటే !

By:  Tupaki Desk   |   11 Nov 2019 6:03 AM GMT
హైకర్టు లో ఆర్టీసీ భవితవ్యం..ఏంచెప్పబోతుందంటే !
X
తెలంగాణ ఆర్టీసీ సమ్మె పై రాష్ట్ర హైకోర్టు ఈ రోజు ఫైనల్ తీర్పు ఇవ్వబోతుందా .. ఈ తీర్పు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉంటుందా లేక ప్రభుత్వానికి మద్దతుగా రాబోతోందా ..ఇవే విషయాలు ఇప్పుడు అందరిని కలచివేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె లోకి వెళ్లి నెల రోజులు దాటిపోయింది కానీ , దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వారి డిమాండ్స్ పరిష్కరించలేము అంటూ కాలయాపన చేస్తుంది. ఈ బంద్ వల్ల ఆర్టీసీ , ప్రభుత్వం ఏమి సాధించిందో కరెక్ట్ గా తెలియదు కానీ , ప్రజలు మాత్రం సరైన సమయానికి బస్సులు లేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి రాకపోతే... ప్రైవేట్‌కి పర్మిట్స్ ఇచ్చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడంతో... కంగారుపడొద్దని ఈ నెల 7న హైకోర్టు తన విచారణలో తెలిపింది. మరోసారి చర్చలు జరపమని సూచించింది. తన నిర్ణయమేంటో 11న చెబుతానంది. ఐతే... ప్రభుత్వం ఎలాంటి చర్చలూ జరపలేదు. సింపుల్‌గా చర్చల్లేవ్ అని తేల్చేసింది. నిన్న సీఎం కేసీఆర్ సమీక్ష జరిపి తీసుకున్న ఫైనల్ నిర్ణయం ఇదే. ఈ విషయాన్నే ఇవాళ హైకోర్టుకు చెబుతారు. తాము చర్చించుదామనుకున్నా ఆర్టీసీ జేఏసీ ముందుకు రాలేదని హైకోర్టుకు చెప్పబోతున్నారు.

టీఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని.. చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయని, ఈ పరిస్థితి ఎప్పటి నుంచో ఉన్నా ప్రభుత్వం సహకరిస్తూనే ఉందని నివేదికలో పేర్కొన్నారు. సమ్మె చట్టవిరుద్ధమని కార్మిక శాఖ చెప్పినా కొనసాగిస్తున్నారని తప్పుబట్టారు. ఆగస్టు 31నాటికి ఆర్టీసీ రూ.5,269 కోట్ల నష్టాల్లో ఉందని, బ్యాంకులు, ఇతర సంస్థలకు రూ.1,786 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు. ప్రస్తుత బడ్జెట్‌ పరిమితుల నేపథ్యంలో రూ.47 కోట్లను కూడా కేటాయించే పరిస్థితిలో లేము. అయినా.. ఎన్నిసార్లు.. ఎంత వరకూ ఆర్టీసీని ప్రభుత్వం కాపాడగలదు అనేది తేలని అంశంగా మారిందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలపనుంది.

ప్రజలకు రవాణా సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందిని నియమించిందని, విధులు నిర్వర్తించకుండా ఆర్టీసీ యూనియన్లు వారిని అడ్డుకుంటున్నాయని కోర్టుకు నివేదించింది. దీంతో..ఇప్పుడు కోర్టు ఏ రకంగా స్పందిస్తుందీ.. సమస్య పరిష్కార దిశగా సూచనలు చేస్తుందా..ఈ రోజుతో సమస్య ముగిసిపోతుందా.. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తుందా అనే కోణంలో ప్రస్తుతం అటు ప్రభుత్వం..ఇటు ఆర్టీసీ జేఏసీ హైకోర్టు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ రోజు సమ్మె లో భాగంగా నేడు మంత్రుల ఇళ్ల ముందు ఆందోళనలు చెయ్యమని పిలుపిచ్చింది. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తుంది.