Begin typing your search above and press return to search.

ఇక.. ఆర్ ఎస్ ఎస్ అందరిదా?

By:  Tupaki Desk   |   4 Jan 2016 4:24 PM IST
ఇక.. ఆర్ ఎస్ ఎస్ అందరిదా?
X
‘‘భారతమాతా కీ జై’’ అన్న మాట నోటి నుంచి వస్తే చాలు.. అలా అన్న వ్యక్తి అయితే.. బీజేపీ లేదంటే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా లెక్క తేల్చటం మామూలే. భారతమాత లాంటి ప్రస్తావనలు సంఘ్ నేపథ్యం ఉన్న వారికే చెల్లుతుందని లౌకిక వాదుల సూత్రీకరిస్తారు. భారతమాత అంటే.. భారతీయులందరికి అమ్మ అన్న విషయాన్ని ఏమార్చి.. సెక్యులరిజం పేరుతో ఆ మాటను హిందుత్వానికి నిదర్శనంగా మాటలు చెప్పటం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది.

దేశంలో ఎక్కడ.. ఎలాంటి విపత్తు విరుచుకుపడినా తాము ఉన్నామంటూ దూసుకెళ్లే ఆర్ ఎస్ ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ను లౌకిక శక్తులు కాస్త దూరంగా ఉంచుతాయి. అయితే.. తమను తాము మార్చుకోవటంతో పాటు.. సంఘ్ కొందరిది మాత్రమే కాదని.. అందరిదన్న భావనను వ్యాప్తి చేయటానికి కొత్త కసరత్తు మొదలెట్టింది.

సంఘ్ హిందువుల్ని మాత్రమే ఆదరిస్తుంది. ముస్లిం.. క్రిస్టియన్.. ఇతర మతాలకు పెద్దగా అవకాశం ఇవ్వలేదన్న అపప్రదను పొగొట్టే చర్యలు మొదలెట్టింది. ఇందులో భాగంగా.. పదేళ్ల క్రితం సంఘ్ ముస్లిం విభాగాన్ని (ముస్లిం రాష్ట్రీయ మంచ్) స్టార్ట్ చేశారు. తాజాగా ఆ తరహాలోనే.. క్రిస్టియన్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన నలుగురు ఆర్చి బిషప్ లు.. 40 మంది రెవరెండ్ బిషప్ లతో చర్చలు జరిపారు. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలైనా.. అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని చెబుతున్నారు. కొత్త పుంతలు తొక్కేలా కార్యాచరణ రచిస్తున్న సంఘ్ వ్యూహం ఆయా వర్గాల్ని ఎంతమేర ఆకర్షిస్తుందో చూడాలి.