Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ః ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్ కుమార్ రాజీనామా!

By:  Tupaki Desk   |   19 July 2021 12:30 PM GMT
బ్రేకింగ్ః ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్ కుమార్ రాజీనామా!
X
తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ గురుకులాల కార్య‌ద‌ర్శి, ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్ కుమార్ రాజీనామా చేశాడు. గురుకులాల కార్య‌ద‌ర్శి ప‌ద‌వితోపాటు త‌న ఐపీఎస్ స‌ర్వీసుకు సైతం రాజీనామా చేస్తున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేఖను పంపించారు. త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే రాజీనామా చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

ఈ విష‌యాన్ని ప్ర‌వీణ్ కుమార్‌ ట్విట‌ర్లో వెల్ల‌డించారు. అదేవిధంగా.. ప్ర‌జ‌ల‌కు ఓ లేఖ రాశారు. తాను గ‌డిచిన 26 ఏళ్లుగా ఈ స‌ర్వీసులో ఉన్నాన‌ని, వివిధ హోదాల్లో ప‌నిచేశాన‌ని చెప్పారు. ఇంకా 6 సంవ‌త్స‌రాల స‌ర్వీసు ఉన్న‌ప్ప‌టికీ త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల‌నే రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక‌పై త‌న మ‌న‌సుకు న‌చ్చిన విధంగా, ఇష్ట‌మైన ప‌నులు చేసేందుకే వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నించాల్సిన అంశం.

ఇక నుంచి బాబాసాహెబ్ అంబేద్క‌ర్‌, మ‌హాత్మ జ్యోతిరావు పూలే, కాన్షీరాం మార్గంలో న‌డుస్తాన‌ని, భావిత‌రాల‌ను కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని తెలిపారు. ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గురుకులాల కార్య‌ద‌ర్శిగా, స్వేరేస్ నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌వీణ్ కుమార్ ఎంతో ప్ర‌గ‌తిని సాధించి చూపారు. ఎంతో మంది మ‌న్న‌న‌లు అందుకున్నారు. అయితే.. ప‌లు వివాదాలు కూడా వ‌చ్చాయి.

ఆయ‌న ఓ వ‌ర్గంపై వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో.. అక్క‌డి నిర్వాహ‌కులు అంబేద్క‌ర్ ప్ర‌తిజ్ఞ చేశారు. ఆ స‌మ‌యంలో ప్ర‌వీణ్ కుమార్ అక్క‌డే ఉన్నారు. అయితే.. ఆ ప్ర‌తిజ్ఞ‌లో హిందూ మ‌తానికి సంబంధించిన వ్య‌తిరేక వ్యాఖ్య‌లు ఉన్నాయంటూ కొంద‌రు అభ్యంత‌రం తెలిపారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌కు త‌న‌కు సంబంధం లేద‌ని ప్ర‌వీణ్ కుమార్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఉన్న‌ట్టుండి రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది.