Begin typing your search above and press return to search.

రూ20 ‘టీ’కి రూ.50 సర్వీస్ ఛార్జి.. ఇదేం లెక్క ఐఆర్ సీటీసీ?

By:  Tupaki Desk   |   3 July 2022 4:30 AM GMT
రూ20 ‘టీ’కి రూ.50 సర్వీస్ ఛార్జి.. ఇదేం లెక్క ఐఆర్ సీటీసీ?
X
టీ ధర రూ.20. కానీ.. దాన్ని సర్వ్ చేసినందుకు రూ.50 ఇవ్వాలంటే ఎవరైనా ఏమంటారు? కానీ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఆర్ సీటీసీ మాత్రం తన తొండి లెక్కల్ని సర్క్యులర్ పేరుతో సమర్థించుకుంటోంది. రైల్వే ప్రయాణించే వేళలో సర్వ్ చేసిన టీకి రూ.20 ఛార్జీ వసూలు చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. దానికి రూ.50 సర్వీసు ఛార్జితో మొత్తం రూ.70 వసూలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఒక ప్రయాణికుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఐఆర్ సీటీసీ దోపిడీ మరీ ఇంత భారీగా ఉంటుందా? అని ఆశ్చర్యపోయే పరిస్థితి.

వినోద్ వర్మ అనే ప్రయాణికుడు ఢిల్లీ నుంచి భోపాల్ వరకు నడిచే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణించాడు. జూన్ 28న రైల్లో ప్రయాణించే సమయంలో అతను టీ తాగారు. దీనికి ఐఆర్ సీటీసీ సిబ్బంది టీ చేతికి ఇచ్చి.. రూ.70 చెల్లించాలంటూ రశీదు ఇచ్చారు. దీంతో కంగుతిన్న అతడు.. టీ ధర రూ.70? అంటూ అవాక్కు అయ్యారు. బిల్లును చూస్తే.. అందులో టీ ధర రూ.20 మాత్రమేనని.. కానీ అందుకు సర్వీసు ఛార్జి మాత్రం రూ.50 అదనంగా చెల్లించాలని పేర్కొనటంతో.. ఇదెక్కడి అన్యాయం బాబు? అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

ఇతగాడి పోస్టు వైరల్ అయ్యింది. పలువురు ఈ తీరును తప్పుపట్టారు. మరికొందరు సర్వీసు ఛార్జిని ఎలా వసూలు చేస్తారంటూ ప్రశ్నించారు. అయితే.. ఈ తీరుపై ఐఆర్ సీటీసీ వివరణ ఇచ్చింది. 2018లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం రాజధాని.. శతాబ్ది రైళ్లలో ప్రయాణ టికెట్ తో పాటే ఫుడ్ ను కూడా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా టికెట్ కొనుగోలు చేసేటప్పుడు కాకుండా.. ప్రయాణ సమయంలో కొనుగోలు చేస్తే.. సర్వీసు ఛార్జి వసూలు చేసేందుకు వీలుగా సర్క్యులర్ ఇంది.

అయితే.. గతంలో రైళ్లలో పుడ్ డెలివరీకి సంబంధించి సర్వీసు చార్జి అన్నది టికెట్ ఛార్జీతో ఉండేది. తర్వాతి కాలంలో ప్రయాణికుల ఇష్టానికి వదిలేశారు. కానీ.. ఇప్పుడు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్న వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. మరి.. ఇప్పటికైనా ఐఆర్ సీటీసీ కళ్లు తెరిచి.. తాను చేస్తున్న తప్పును ఇప్పటికైనా దిద్దుకుంటుందా? ఇలానే కంటిన్యూ చేస్తుందా? అన్నది చూడాలి.