Begin typing your search above and press return to search.

అప్పు మీద అప్పు.. 2 వారాల్లో రూ.4వేల కోట్లు

By:  Tupaki Desk   |   22 Sep 2021 10:30 AM GMT
అప్పు మీద అప్పు.. 2 వారాల్లో రూ.4వేల కోట్లు
X
తింటూ కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయని ఊరికే అనలేదేమో? తాజాగా ఏపీ సర్కారు తీరు చూస్తే ఇదే రీతిలో ఉంది. అలివి కాని సంక్షేమ పథకాల అమలుతో.. నిధుల్ని పప్పు బెల్లాల మాదిరి పంచేస్తున్న వైనం ఇప్పుడు రాష్ట్రానికి కొత్త సమస్యల్ని తెచ్చి పెడుతోంది. కరోనా కారణంగా ఆదాయం తగ్గటం.. ఖర్చులు భారీగా పెరిగిపోవటం తెలిసిందే. దీనికి తోడు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు భారీ ఎత్తున నిధులు అవసరమవుతున్నాయి. అందుకు తగ్గట్లుగా ఆదాయం లేకపోవటంతో అప్పుల మీద ఆధారపడుతోంది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు రూ.20వేల కోట్లు అప్పులు చేసేందుకు కేంద్రం పరిమితి ఇవ్వగా.. ఆగస్టు నాటికే ఆ పరిమితి ముగిసింది. దీంతో.. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిన రాష్ట్రం ఎట్టకేలకు ఈ మధ్యనే రూ.10,500 కోట్ల అదనపు రుణాన్ని తీసుకునే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో.. అదనపు రుణం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లైయ్యాయి. పదివేల కోట్ల రుణానికి అవకాశం ఇవ్వటంతో.. ఏపీ సర్కారుకు ఉపశమనం లభించినట్లైంది.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ.. కేంద్రం ఓకే చెప్పిన అదనపు రుణ పరిమితి గురించి చర్చ సాగుతుండగానే.. రెండు వారాలకే రూ.4వేల కోట్లు రుణాన్ని తీసేసుకోవటం షాకింగ్ గా మారింది. ఈ నెల మూడున అదనపు రుణానికి అనుమతి తెచ్చుకుంటే.. ఏడో తేదీన రూ.2వేల కోట్లు.. 14న వెయ్యి కోట్ల.. 21న మరో వెయ్యి కోట్ల రుణాన్ని తీసుకున్నారు.

తాజాగా తీసుకొచ్చిన రూ.వెయ్యి కోట్లలో రూ.500 కోట్లకు చెల్లింపు పరిమితి 14 ఏళ్లు కాగా.. మరో రూ.500 కోట్లకు పరిమితిని ఏకంగా 19 ఏళ్లకు పెట్టుకున్నారు. అంతే.. రానున్న మరో మూడు.. నాలుగు ప్రభుత్వాలు తాజాగా చేసిన రుణానికి సంబంధించిన బాధ్యత వహించాల్సి వస్తోందన్న మాట. అప్పు చెల్లింపు కాల పరిమితి ఎక్కువగా ఉండటం ద్వారా.. రాష్ట్రం అప్పుల్లోకి జారుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల కేంద్రం ఇచ్చిన రూ.10,500 కోట్ల రుణ పరిమితిలో ఇప్పటికే రూ.4వేల కోట్లు పూర్తి కావటం.. కేవలం రూ.6,500 కోట్లు మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ మొత్తం రానున్న మూడు నెలలకు సరిపోతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వారానికి వెయ్యి కోట్ల చొప్పున అప్పు తీసుకుంటే.. మరో ఆరు వారాలకే ఈ మొత్తం పరిమితి పూర్తి అవుతుంది? తర్వాత పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఏమైనా.. ఈ అప్పుల ఊబి నుంచి ఏపీ ఎప్పటికి బయటపడుతుందన్నది పెద్ద చర్చగా మారింది.