Begin typing your search above and press return to search.

రూ. 4 వేల కోట్లు ఖజనాకు జమ చేయాలి..హైకోర్టులో పిటీషన్

By:  Tupaki Desk   |   1 Dec 2020 2:50 PM IST
రూ. 4 వేల కోట్లు ఖజనాకు జమ చేయాలి..హైకోర్టులో పిటీషన్
X
ఏపీలో మరోసారి కార్యాలయాలకు రంగుల వివాదం తెరపైకి వచ్చింది. హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలైంది. పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారని మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో రంగులేసి తొలగించినందుకు రూ.4 వేల కోట్లయ్యాయని.. వీటిని రాబట్టాలని పిటిషనర్ కోరారు. ఈ రూ.4 వేల కోట్లను ఖజానాకు జమ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణలను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్ దాఖలు చేశారు. కాగా అఫిడవిట్ సరిగా వేయాలని పిటిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

వైసీపీ ప్ర‌భుత్వం స్థానిక ప‌రిపాల‌నా వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామ స‌చివాల‌యాలు, వార్డు స‌చివాల‌యాలను ప్ర‌వేశ‌పెట్టింది. రాష్ట్రంలో 17,367 గ్రామాలుండ‌గా, 12,918 గ్రామ‌పంచాయతీలు ఉన్నాయి. న‌గ‌ర పాల‌క‌సంస్థ‌లు, పుర‌పాల‌క సంఘాలు, న‌గ‌ర పంచాయతీలు క‌లిపి మ‌రో 195 ఉన్నాయి. వాటిని ప్ర‌తి 2,000 జ‌నాభాకు ఒక‌టి చొప్పున విభ‌జించి 11,114 గ్రామ స‌చివాల‌యాలు, 3,775 వార్డు స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేసింది.

కొత్త‌గా ఏర్పాటు చేసిన వార్డు, గ్రామ స‌చివాల‌యాల‌ కోసం వివిధ ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు. మ‌రికొన్ని చోట్ల అద్దె భ‌వ‌నాల్లో కూడా ఏర్పాటు చేశారు. అయితే పంచాయతీ కార్యాల‌యాల‌తో పాటుగా కొత్త‌గా ఏర్పాటు చేసిన ఈ స‌చివాల‌యాల‌న్నింటికీ మూడు రంగుల‌ను వేయించాల‌ని పంచాయతీరాజ్ శాఖ అధికారులు 2019 ఆగ‌స్టు 11న మెమో రూపంలో ఉత్త‌ర్వులు ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్సార్‌సీపీని పోలిన రంగులు వేస్తోందంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు రంగులు మార్చాలని ఆదేశించింది.. దీంతో ప్రభుత్వంఎర్రమట్టి, ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు వేసేలా ప్రభుత్వం ఏప్రిల్‌ 23న జీవో 623ను జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ మళ్లీ హైకోర్టును కొందరు ఆశ్రయించగా విచారణ జరిపింది. రంగులపై ప్రభుత్వం ఇచ్చిన జీవో 623ను రద్దు చేసింది.