Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ క‌లెక్ష‌న్ మ‌రీ ఇంత వీకా..?

By:  Tupaki Desk   |   10 Oct 2018 4:07 AM GMT
కాంగ్రెస్ క‌లెక్ష‌న్ మ‌రీ ఇంత వీకా..?
X
అధికారంలో లేకుంటే చాలు.. పార్టీకి వ‌చ్చిప‌డే విరాళాలు ఎంత‌లా ప్ర‌భావితం అవుతాయో చెప్పే లెక్క‌గా దీన్ని చెప్పాలి. ప‌దేళ్లు నాన్ స్టాప్ గా అధికారాన్ని అనుభ‌వించిన కాంగ్రెస్ పార్టీ.. 2014 ఎన్నిక‌ల్లో దారుణంగా దెబ్బ తిన్న వైనం తెలిసిందే.

ఒక‌ప్పుడు దేశంలోని ఏ మూల‌న చూసినా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం క‌నిపించేది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్లో ఉన్నది ఒక‌ట్రెండు రాష్ట్రాల్లో మాత్ర‌మే. అది కూడా పూర్తిస్థాయి నిఘా పార్టీల ఉంద‌న్న‌ది తెలిసిందే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తుందంటే..ప‌ద‌ళ్ల‌పాటు తిరుగులేని ప‌వ‌ర్ ను అనుభ‌వించిన పార్టీ.. నాలుగేళ్లు ప‌వ‌ర్ కు దూరంగా ఉంటే.. ఆ పార్టీ బ్రాండ్ వాల్యూ ఎంత‌గా ప‌డిపోయింద‌న్న విషయానికి తాజా నిద‌ర్శ‌నంగా కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చిన విరాళాల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశ వ్యాప్తంగా వివిధ వ‌ర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళాలు కేవ‌లం రూ.26 కోట్లు మాత్ర‌మేన‌ని ఆ పార్టీ వెల్ల‌డించింది. పార్టీకి విరాళాల రూపంలో వ‌చ్చిన రూ.26 కోట్ల‌లోనూ అత్య‌ధికంగా ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఇచ్చిన‌వే కావ‌టం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ త‌న‌కు తానే వెల్ల‌డించింది. ఈ ఏడాది సెప్టెంబ‌రులో ఈసీకి తాము స‌మ‌ర్పించిన నివేదిక‌లో విరాళాల లెక్క‌ల్ని పేర్కొన్నారు. అయితే.. ఎల‌క్ట్రోర‌ల్ బాండ్ల ద్వారా వ‌చ్చిన ఆదాయం లెక్క‌ల్ని మాత్రం చెప్ప‌లేదు. ఐటీశాఖ‌కు ఇచ్చే తుది ఆడిట్ రిపోర్ట్‌ లో ఈ బాండ్ల వివ‌రాలు చేరే అవ‌కాశం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. బాండ్ల ద్వారా నిధుల్ని స‌మీక‌రించిన విష‌యంలో అన్నీ పార్టీలు ఉన్నాయి. అదే రీతిలో ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన నివేదిక‌లో ఏ పార్టీ కూడా త‌మ పార్టీకి ఎల‌క్ట్రోర‌ల్ బాండ్ల రూపంలో ఎంత వ‌చ్చింద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. రాజ‌కీయ పార్టీల‌కు అక్ర‌మ విరాళాల్ని అరిక‌ట్టాల‌నే ఉద్దేశంతో మోడీ స‌ర్కారు 2017 బ‌డ్జెట్ లో ఈ బాండ్ల ప‌థ‌కాన్ని షురూ చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ 2018లో విడుద‌లైంది.

తొలి విడ‌త‌గా విడుద‌ల చేసిన బాండ్ల‌లో రూ.250 కోట్ల వ‌ర‌కూ బాండ్ల‌ను వివిధ సంస్థ‌లు సేక‌రించాయి. అయితే.. ఏ ఏ పార్టీకి ఎన్ని బాండ్ల‌ను ఆదాయం రూపంలో పొందాయ‌న్న లెక్క మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. నేరుగా విరాళాల రూపంలో వ‌చ్చిన మొత్తం భారీగా త‌గ్గ‌టం కాంగ్రెస్ కు ఇబ్బందేన‌న్న మాట వినిపిస్తోంది.