Begin typing your search above and press return to search.

మూడేళ్ల చిన్నారికి రూ.22 కోట్ల ఇంజక్షన్.. సాయంగా 62వేల ముంది వచ్చారు

By:  Tupaki Desk   |   12 Jun 2021 11:00 AM IST
మూడేళ్ల చిన్నారికి రూ.22 కోట్ల ఇంజక్షన్.. సాయంగా 62వేల ముంది వచ్చారు
X
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు నెగిటివ్.. నెగిటివ్. ఇలాంటి ఉదంతాల గురించి విని.. చదివి విసిగిపోయి ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు మేం చెప్పే రియల్ స్టోరీ అందుకు భిన్నమైనది. చుట్టూ ఉన్న వారిలో చాలా మంది మూర్తీభవించిన మానవత్వం ఉన్నోళ్లని.. కష్టంలో ఉన్న వారిని ఆదుకోవటానికి వెనుకాడరన్న వైనం అర్థం కావటమే కాదు.. అసాధ్యం అన్నది ఏమీ లేదని.. సానుకూలతతో ప్రయత్నించి చూస్తే.. మార్గం చూపించేటోళ్లు ఎంతో మంది మన చుట్టూనే ఉన్నారన్న విషయం చెప్పే ఉదంతంగా చెప్పాలి. రూ.22 కోట్ల విలువ చేసే ఇంజక్షన్ ఆ బాబు ప్రాణాల్ని కాపాడతుందన్న వేళ.. అంత మొత్తాన్ని సమకూరిన వైనం సంతోషాన్ని ఇస్తుంది. అసలేమైందంటే?

హైదరాబాద్ కు చెందిన యోగేశ్.. రూపల్ దంపతులకు మూడేళ్ల క్రితం పండంటి బాబు పుట్టాడు. అతడికి ఆయాన్ష్ అని పేరు పెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నా.. ఆ బాలుడు మామూలుగా లేడన్న విషయాన్ని పేరెంట్స్ గుర్తించారు. ఆరో నెల వచ్చినా మెడ నిలపలేకపోవటంతో వైద్యుల్ని సంప్రదించారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆ చిన్నారి టైప్‌ 1 ‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ (ఎస్‌ఎంఏ)’ తో బాధ పడుతున్నట్లుగా గుర్తించారు. చాలా అరుదుగా సంభవించే వ్యాధిగా తేల్చారు. మరి.. మందు మాటేమిటి? అంటే.. ఆ పిల్లాడ్ని చేసుకొని బాధ పడటం.. బతికున్నంత కాలం ప్రేమగా చూసుకోవటం తప్పించి మరింకే లేదని కొందరు వైద్యులు చెప్పటంతో ఆ యువ దంపతులు డీలా పడ్డారు.

మరిన్ని ప్రయత్నాలు చేయగా.. బాలుడ్ని బతికించే ఏకైక మార్గం ఉందంటూ.. ‘‘జోల్‌గెన్‌స్మా’’ ఇంజెక్షన్ గురించి చెప్పారు. దాని ఒక్క డోసు ఖరీదు అక్షరాల రూ.16 కోట్లు. దిగుమతి సుంకం రూ.6 కోట్లు. వెరసి.. రూ.22 కోట్లు. ఆ మాట విన్నంతనే ఆయాన్ష్ తల్లిదండ్రుల గుండెలు బాధతో బరువెక్కాయి. మధ్యతరగతి జీవితాలకు అంత ఖరీదైన మందు సాధ్యమే కాదు. దీంతో.. తీవ్ర వేదనకు గురయ్యారు.

ఏం చేసైనా తమ పిల్లాడ్ని బతికించుకోవాలనుకున్నారు. అందులో భాగంగా తమ పిల్లాడి పరిస్థితిని తెలియజేసి క్రౌడ్ ఫండింగ్ కోసం అప్పీల్ చేశారు. ఆయాన్ష్ గురించి ఇంపాక్ట్ గురు అనే వెబ్ సైట్ ద్వారా తమ కుమారుడి అరుదైన ఆరోగ్య సమస్య గురించి వివరించి.. వైద్యులు చెప్పిన వివరాల్ని తెలియజేశారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు మనసున్న మారాజులు ముందుకు రావటంతో అది కాస్తా కరిగిపోవటం మొదలైంది. రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం 62,400 మంది సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందులో ఒక దాతే రూ.56 లక్షలు ఇవ్వగా.. మరో దాత ర.50 లక్షలు ఇచ్చాడు.

బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆయాన్ష్ కు సాయం చేసేందుకు మందుకు వచ్చారు. ఇలా 127 రోజుల్లో రూ.14.84 కోట్లు దాతల నుంచి సమకూరగా.. మిగిలిన మొత్తాన్ని మరో అంతర్జాతీయ క్రౌడ్ ఫండింగ్ సంస్థ సర్దటంతో ఇంజెక్షన్ కు అవసరమైన మొత్తం సమకూరింది. అదే సమయంలో.. కేంద్రం కూడా రూ.6కోట్ల సుంకాన్ని రద్దు చేసి పెద్ద మనసు చాటుకుంది. దీంతో అసాధ్యమనుకున్న ఇంజెక్షన్ వైద్యం సాధ్యమైంది. హైదరాబాద్ లోని రెయిన్ బో పిల్లల ఆసుపత్రి ఇంజెక్షన్ ఇచ్చి.. వైద్య సాయాన్ని అందించారు.

దాదాపు రెండేళ్లుగా పడుతున్న వేదనకు తాజాగా ఫుల్ స్టాప్ పడినట్లు చెబుతున్న ఆయాన్ష్ తల్లిదండ్రులు.. తమకు సాయం చేసిన వారందరికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. ఇంజెక్షన్ ఇచ్చిన ఆయాన్ష్ ను మరో మూడు నెలల పాటు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పుడు చెప్పండి.. మన చుట్టూ ఉన్న వారిలో దుర్మార్గులు.. కఠినాత్ములు కొందరు ఉండొచ్చు. కానీ.. అంతకు మించి మానవత్వంతో ఉన్న వారెందరో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు.