Begin typing your search above and press return to search.

జగన్ పార్టీ పరువు తీశాడే..ఎమ్మెల్యే గౌడన్లో వాటి తయారీ!

By:  Tupaki Desk   |   20 July 2020 12:00 PM IST
జగన్ పార్టీ పరువు తీశాడే..ఎమ్మెల్యే గౌడన్లో వాటి తయారీ!
X
అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం పలు పథకాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. పార్టీని అంతకంతకూ బలోపేతం చేయాలన్న సంకల్పంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు భిన్నంగా పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు చేస్తున్నారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేస్తున్న వారి విషయంలో జగన్ ఎలాంటి మొహమాటానికి తావు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వేళలోనూ పార్టీ పరువు.. ప్రతిష్ఠల్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న ఒక ఎమ్మెల్యే వ్యవహారం బయటకు రావటం షాకింగ్ గా మారింది.

ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా (గుంటూరు ఈస్ట్)కు చెందిన గోదాముల్లో చట్టవిరుద్ధంగా గుట్కా తయారీ అవుతుందన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. గుంటూరుకు సమీపంలోని పెదకాకానీ మండలం కొప్పురావూరు సమీపంలోని గోదాముల్లో గడిచిన కొద్ది కాలంగా అక్రమంగా పెద్ద ఎత్తున గుట్కా తయారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆదివారం సదరు గోదాముల్లో ఆకస్మిక సోదాల్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా రూ.కోటి విలువైన గుట్కాల్ని సాధ్వీనం చేసుకున్నారు. టెంపర్ పేరుతో తయారు చేస్తున్న గుట్కా నిల్వలు భారీగా బయటకు వచ్చాయి. ఈ పాన్ మసాలా తయారీ కోసం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో అనుమతులు తీసుకొని గోదాముల్ని నడుపుతున్నట్లుగా చెబుతున్నారు. టెంపర్ పేరుతో గుట్కాల్ని తయారు చేసి పలు ప్రాంతాల్లో అమ్ముతున్న ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్లే కొద్దీ మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన గోదాముల్లో ఇంత భారీగా గుట్కా దందా బయటకు రావటం సంచలనంగా మారింది.అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే రీతిలో ఈ ఉదంతం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ పరువు ప్రతిష్ఠల్ని దెబ్బ తీసేలా మారిన ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై సదరు ఎమ్మెల్యే ఇప్పటివరకూ మౌనంగా ఉన్నారు. ఆయన స్పందించాల్సి ఉంది.