Begin typing your search above and press return to search.

3 కేజీల బంగారాన్ని బాత్రూంలో పడేశాడు!

By:  Tupaki Desk   |   25 Aug 2019 12:08 PM GMT
3 కేజీల బంగారాన్ని బాత్రూంలో పడేశాడు!
X
ఇప్పటికే కేజీల కొద్దీ బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నా.. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని అక్రమంగా తేవటం మాత్రం ఆగటం లేదు. ఇప్పటికే పలు విధాలుగా విదేశాల నుంచి తీసుకొస్తున్న అక్రమ బంగారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను దాటలేకపోతోంది. ఈసారి తనతో తెచ్చిన బంగారం అధికారుల తనిఖీలో దొరికిపోతుందన్న విషయాన్ని గుర్తించి.. బాత్రూంలో పడేసినా దొరికిపోయిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ తెల్లవారుజామున (ఆదివారం) షార్జా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి దగ్గర మూడు కేజీల బంగారు బిస్కెట్లు అక్రమంగా తీసుకొస్తున్న విషయం కస్టమ్స్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీని విలువ రూ.1.11 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లోకి దిగిన సాజిద్.. కస్టమ్స్ అధికారులు అలెర్ట్ గా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే.. తనతో తెచ్చిన బంగారాన్ని బాత్రూంలో పడేసి బయటకు వచ్చారు.

తనిఖీలు చేస్తున్న అధికారులు సాజిద్ వద్ద చెక్ చేయగా ఎలాంటి బంగారం లభించలేదు. దీంతో.. సాజిద్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో.. తాను బాత్రూంలో పడేసిన విషయాన్ని వెల్లడించారు. అతన్ని తీసుకొని బాత్రూంలో అతను పడేసిన మూడు కేజీల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. తాజా ఉదంతం సంచలనంగా మారింది.