Begin typing your search above and press return to search.

భాగ్యనగరిలో రూ.10వేల కోట్ల భూమి వివాదంలో ప్రభుత్వానిదే విజయం

By:  Tupaki Desk   |   1 Jan 2022 11:01 AM IST
భాగ్యనగరిలో రూ.10వేల కోట్ల భూమి వివాదంలో ప్రభుత్వానిదే విజయం
X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.10వేల కోట్ల విలువైన భూమికి స్పాట్ పెట్టేశారు కబ్జారాయుళ్లు. ప్రభుత్వానికి చెందిన భూమి తమదేనని నకిలీ పత్రాలతో ఆక్రమించుకునే ప్రయత్నంతో పాటు.. వెంచ్ వేసేసి.. అమ్మకాలు షురూ చేశారు. దీంతో స్పందించిన అధికారులు కోర్టును ఆశ్రయించారు. కబ్జాదారులు కన్నేసిన 142 ఎకరాల్ని ప్రభుత్వ పరం అయ్యేందుకు అధికారులు వ్యవహరించిన తీరుతో తాజాగా తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి విజయం లభించింది. ఇంత విలువైన భూముల్ని పరిరక్షించటంతో కీలకంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారుల్ని అభినందించకుండా ఉండలేం.

ఇంతకీ.. ఇంత భారీ ఎత్తున ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన ఉదంతంలోకి వెళితే..పేరుకు హైదరాబాద్ శివారు భూములు అయినప్పటికీ వాటి విలువ అక్షరాల రూ.10 వేల కోట్లు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం.. ప్రస్తుతం గండిపేట మండలం పరిధిలోని మంచిరేవుల గ్రామం సర్వే నెంబర్లు 393/1 నుంచి 393/20 వరకు ఉన్న 142 ఎకరాల 39 గుంట భూమి ప్రభుత్వానిది. దీన్ని యాంటీ నక్సల్స్ స్వ్కాడ్ గ్రేహౌండ్స్ కు అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం కేటాయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. 2007లో ఈ భూమి విలువ భారీగా పెరిగిపోయిన వేళ.. 20 మంది అసైనీలు ఆ భూములు తమవేనంటూ హైకోర్టులో పిటీషన్ వేశారు. 1940నుంచి తమకు ఆ భూముల మీద హక్కు ఉందని పేర్కొన్నారు.

2006-07 ప్రాంతంలో కోకాపేట భూముల వేలంలో ఎకరా రూ.14 కోట్లకు రికార్డుతో రియల్ బూం ప్రారంభమైన వేళ.. ఈ విలువైన భూముల్ని అక్రమించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాల్ని షురూ చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆధారాల్ని పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఆ భూములు గ్రౌహౌండ్స్ కు చెందుతాయని తీర్పును ఇచ్చింది. అయితే.. హైకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉందంటూ అసైనీలు ఆ భూములు తమవేనని మళ్లీ కేసు వేశారు.

వారి వాదనల్ని విన్న సింగిల్ బెంచ్ జడ్జి 2010లో ఆ భూములు అసైనీలకు చెందుతాయని తీర్పును ఇవ్వటంతో.. ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ స్టేటస్ కోను విధించింది.ఇదిలా ఉంటే.. రెండేళ్ల క్రితం ఇద్దరు వ్యక్తులు అసైనీలతో జీపీఏ చేయించుకొని మళ్లీ ఆ భూమిని సొంతం చేసుకోవటానికి కొత్త ఎత్తు వేసే ప్రయత్నాన్ని షురూ చేయటంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఇష్యూ సీఎం కేసీఆర్ వరకు వెళ్లటం.. దానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయటంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఆర్డీవో చంద్రకళ 2020 జూన్ 24న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దుబాయ్ లో ఉన్న నిందితులపై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం వారు నగరానికి రాగా.. వారికి నోటీసులు ఇచ్చి.. కోర్టులో అభియోగపత్రాల్ని దాఖలు చేశారు.తాజాగా టీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ.. జస్టిస్ టి. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం దీనిపై తీర్పును ఇచ్చింది. 2010లో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసి.. ఈ రూ.10వేల కోట్ల విలువైన భూములు గ్రేహౌండ్స్ సొంతమని తేల్చింది.

ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం కాకుండా తెలంగాణ పోలీసు శాఖ.. గ్రేహౌండ్స్ అదనపు డీజీ.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. రాజేంద్రనగర్ ఆర్డీవో.. గండిపేట ఎమ్మార్వోలు చేసిన కృషిని కొనియాడారు. హైకోర్టు తీర్పుతో భూముల ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ భూముల్లో 75 ప్లాట్లను అమ్మిన వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. కొత్త ఏడాది ప్రారంభానికి కాస్త ముందుగా వెలువడిన ఈ తీర్పు కబ్జాదారులకు చెక్ పెట్టేలా ఉందని చెప్పక తప్పదు.