Begin typing your search above and press return to search.

డాక్టర్లకు రూ.1000 కోట్ల వల అబద్దం.. డోలో 650 కంపెనీ స్పందన

By:  Tupaki Desk   |   20 Aug 2022 4:30 PM GMT
డాక్టర్లకు రూ.1000 కోట్ల వల  అబద్దం.. డోలో 650 కంపెనీ స్పందన
X
జ్వరం వచ్చిందంటే చాలు జనాలు డాక్టర్ వద్దకు వెళ్లకుండానే వేసుకునే ట్యాబ్లెట్ డోలో-650. అంతగా ఈ జ్వర నివారణ మాత్ర జనాల్లోకి వెళ్లింది. ప్రతి సామాన్యుడికి డోలో-650 మాత్ర తెలుసు. కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడుకు ప్రపంచదేశాలు మందులు కనిపెట్టడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో డోలో-650 మాత్రల పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది.డోలో-650 మాత్రలు వేసుకుంటే కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు అని భావించిన ప్రజలు తెగ వాడేశారు. వీటి అమ్మకాలు కోట్లలో సాగాయి.

ప్రపంచదేశాలు సైతం డోలో-650 మాత్రలు ఎగుమతి చేసుకోవడానికి ఆ మాత్రలు తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ మీద ఆధారపడ్డారు. అలాంటి డోలో -650మాత్రలు తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ మీద ఐటీ శాఖ అధికారుల దాడులు చేయడంతో దీని బండారం బట్టబయలు అయ్యింది. ఈ ట్యాబ్లెట్ ను సిఫారసు చేయాలని ఏకంగా వైద్యులకు రూ.1000 కోట్లు ముడుపులు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈడీ దాడులు చేయడంతో డోలో 650 గుట్టు రట్టయ్యింది.

డోలో 650 లంచాలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ విషయంపై నివేదిక సమర్పించాలంటూ కేంద్రానికి 10 రోజుల గడువుతో నోటీసులు సైతం జారీ చేసింది. ఈ ఆరోపణలపై డోలో 650 తొలిసారి స్పందించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవంటూ బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కొట్టిపారేసింది.

కరోనా తారాస్థాయికి చేరిన సమయంలోనే డోలో అమ్మకాల ద్వారా రూ.350 కోట్ల వ్యాపారం జరిగిందని .. అలాంటిది వాటి ప్రమోషన్ కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామనే ఆరోపణలు విడ్డూరంగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది

డోలో 650 అనేది ధరల నియంత్రణ పరిధిలోకే వస్తుందని.. కోవిడ్ ఏడాదిలోనే రూ.350 కోట్ల బిజినెస్ జరిగితే.. అలాంటి బ్రాండ్ కోసం రూ.1000 కోట్లు మార్కెటింగ్ చేయడం అసలు సాధ్యమయ్యే పనేనా? అంటూ మైక్రోల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ గోవిందరాజ్ ప్రశ్నించారు. కరోనా టైంలో డోలో 650 ట్యాబ్లెట్స్ మాత్రమే కాదని.. విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా భారీగానే బిజినెస్ చేశాయన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈ కేసు విచారిస్తున్న జస్టిస్ చంద్రచూడ్ కూడా తనకు కరోనా వస్తే ఇదే ట్యాబ్లెట్ ఇచ్చారని.. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేశారు.

బెంగళూరులో ఒకప్పుడు సొంత ఇల్లు కూడా లేని మైక్రో ల్యాబ్స్ అధినేతలు దిలీప్ సురానా, ఆనంద్ సురానా ఈరోజు భారతదేశంలోని 100 మంది శ్రీమంతుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. దేశంలోనే 94వ స్థానంలో ఉన్నారు. ఆదాయపు పన్ను ఎగబెట్టారని ఆరోపణలు రావడంతో బెంగళూరు నగరంలోని మైక్రో ల్యాబ్స్ కార్యాలయంతోపాటు దేశంలోని ఆ కంపెనీకి చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. కానీ ఈ ఆరోపణలపై మైక్రోల్యాబ్స్ తాజాగా ఖండించింది.