Begin typing your search above and press return to search.

రూ.10 వేల కోట్ల ప్యాలెస్.. బూజు పట్టిందని కూల్చేశారు.. మళ్లీ నిర్మించారు..!

By:  Tupaki Desk   |   18 Feb 2021 11:00 PM IST
రూ.10 వేల కోట్ల ప్యాలెస్.. బూజు పట్టిందని కూల్చేశారు.. మళ్లీ నిర్మించారు..!
X
ఇంటికి బూజు ప‌డితే మ‌న‌మైతే ఏం చేస్తాం..? బూజు కర్రతో దులుపుకుంటాం. ఇంకా మంచిగా కావాలంటే.. కొత్తగా పెయింట్ వేయిస్తాం.. కానీ.. అక్కడ బూజుపట్టిందని ఇంటిని కూల్చేశారు! దాని విలువ ఎంతో తెలుసా..? రూ.10 వేల కోట్లు! కూల్చేసి మ‌ళ్లీ క‌డుతున్నారు! న‌మ్మ‌శ‌క్యంగా కావ‌ట్లేదా..? నిజమండీ.. కావాలంటే.. ఈ న్యూస్ చదవండి, మీకే తెలుస్తుంది!

రష్యా దేశంలోని న‌ల్ల స‌ముద్రం తీర ప్రాంతం.. అక్క‌డ ఓ విశాల‌మైన భ‌వ‌నం ఉంది. అది దేశ‌ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన‌ది అంటూ ఇటీవల ఓ వీడియో రిలీజ్ అయ్యింది. రష్యా ప్రతిపక్ష నాయకుడైన‌ అలెక్సీ నవాల్నీ ఈ వీడియోను బయటపెట్టారు. దాదాపు రెండు గంటల నిడివి క‌లిగిన ఈ వీడియోలో ఈ ప్యాలెస్‌లో ఉన్న విలాసవంత‌మైన‌ సౌకర్యాల గురించి వివ‌రించారు.

ఈ ప్యాలెస్ విలువ రూ.9,900 కోట్లు. ఈ భ‌వ‌నానికి బూజు ప‌ట్టింద‌ని, గోడ‌లు న‌ల్ల‌గా మారాయని ప‌డ‌గొట్టి మ‌ళ్లీ నిర్మించార‌ట‌. విప‌క్ష నాయ‌కుడు న‌వాల్నీ విడుద‌ల చేసిన వీడియోలో ఈ ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ప్యాలెస్ అనేది ‘చరిత్రలోనే అతిపెద్ద అవినీతికి చిహ్నం' అని నవాల్నీ అన్నారు. గెలెన్డ్జిక్ రిసార్టు సమీపంలో ఆ ప్యాలెస్ ఉందని, దాని చుట్టూ ఉన్న 70 చదరపు కి.మీ.ల స్థలం రష్యా ఫెడరల్ సెక్యురిటీ సర్వీస్‌దేనని కూడా ఆరోపించారు.

అయితే.. రష్యా ప్రభుత్వ మీడియా కూడా ఆ భవనాన్ని చూపించింది. కానీ.. నవాల్నీ చూపించిన వీడియోకు, సర్కారు మీడియా చూపిన వీడియోకు పొంతన లేదు. అంతేకాదు.. నవాల్నీ బయటపెట్టింది ఒక ఫేక్ వీడియో అని చెప్పారు పుతిన్. ఇదంతా మార్ఫింగ్ మాయాజాలం అని కొట్టి పారేశారు. అంతేకాదు.. ఆ బిల్డింగ్ తనది కాదట. రష్యాలో పెద్ద పెద్ద వంతెనలు, గ్యాస్ పైప్‌లైన్ల వంటి ప్రాజెక్టులు చేపట్టిన సంస్థల యజమాని రోటెన్‌బర్గ్ కు చెందినదట. ఆయన పుతిన్‌కు చిన్ననాటి స్నేహితుడు. ఆ ప్యాలెస్ రోటెన్ బర్గ్ దేనట. ఇక, ఆ ప్యాలెస్ ఉన్న ప్రాంతం మీదుగా విమానాలు సైతం వెళ్లకుండా రష్యా ప్రభుత్వం నో ఫ్లై జోన్ గా కూడా ప్రకటించడం విశేషం.

ఈ బిల్డింగ్ లో 2005 నుంచి 2020 వరకు పలు మార్లు నిర్మాణాలు చేపట్టారు. పలు కారణాలతో నిర్మించడం.. మళ్లీ కూలగొట్టడం.. తిరిగి నిర్మించడం జరిగింది. అయితే.. ఈ ధ్వంసాలకు మెజారిటీ కారణం బూజుగా చూపించడం విశేషం. గోడలు నల్లగా మారాయని, ప్యాలెస్ ను కూలగొట్టి నిర్మించారట. పదిహేనేళ్ల కాలంలో జరిగిన నిర్మాణాల్లో దాదాపు 1500 మంది కార్మికులు పాల్గొన్నార‌ట‌. వీరిలో ప‌లువురు ఈ విషయాన్ని ధృవీక‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా.. ర‌ష్యా విప‌క్ష నేత నవాల్నీపై ఇటీవ‌ల‌ విషప్రయోగం జరిగింది. ఆయ‌న‌ జర్మనీలో చికిత్స తీసుకుని ఈ మధ్యనే రష్యాకు తిరిగివచ్చారు. అయితే.. రాగానే ఆయన్ను అధికారులు ప‌లు కేసుల కింద అరెస్టు చేశారు. న‌వాల్నీ జైల్లో ఉండగానే సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ అవ‌డం విశేషం. ఆ బిల్డింగ్ పుతిన్ దేన‌ని, అక్ర‌మ సంపాద‌న‌తోనే దాన్ని నిర్మించార‌ని న‌వాల్నీ ఆరోపించారు.