Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్.. ఆ మంత్రికే రూ.10కోట్లు లాస్

By:  Tupaki Desk   |   7 March 2020 8:40 AM GMT
కరోనా ఎఫెక్ట్.. ఆ మంత్రికే రూ.10కోట్లు లాస్
X
చైనాను వణికించిన కరోనా వైరస్.. భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేయటం తెలిసిందే. ఒక్క కేసు పాజిటివ్ వచ్చిన సమాచారంతో యావత్ తెలంగాణ.. అందునా హైదరాబాద్ మహానగరం ఎంతలా వణికిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యయవ్వనంతో తొణికిసలాడే భాగ్యనగరి బోసి పోవటమే కాదు.. కరోనా మాట వింటేనే బెదిరిపోయే పరిస్థితి. దీని ప్రభావం హైదరాబాద్ మీద భారీగా పడిందని చెప్పక తప్పదు.

రాత్రి.. పగలు అన్నతేడా లేకుండా నిత్యం హడావుడిగా రోడ్ల మీద తిరిగే ప్రజలు.. మాల్స్. మల్టీఫ్లెక్సుల్లో సేద తీరే వారు ఇప్పడు ఇంటికే పరిమితమవుతున్నారు. ఇక.. హైదరాబాదీయుల్లో కనిపించే మరో లక్షణం.. బయట ఫుడ్ ఎక్కువగా తినటం. కరోనా పుణ్యమా అని బయట తినటాన్ని తగ్గించేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే వేళలో.. నాన్ వెజ్ విషయంలో మరెంత కేర్ ఫుల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

కరోనాకు చికెన్.. మటన్ కు ఎలాంటి సంబంధం లేకున్నా.. ఎందుకైనా మంచిదన్న ముందుచూపు.. భయాందోళనతో ముక్కను ముట్టుకోవటానికి సైతం సంశయిస్తున్నారు. దీంతో.. కోడిగుడ్లు.. చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. కేజీ చికెన్ వందకు ఇస్తామన్నా తీసుకునే వారు కనిపించని పరిస్థితి. చికెన్ తింటే కరోనా రాదు భయ్ అని ఎంత చెప్పినా వినేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఎందుకొచ్చిన గొడవ.. నెల రోజుల చికెన్ తినకుంటే చచ్చిపోతామా? అన్నట్లుగా ఎదురు క్లాసులు పీకుతున్నారు.

ప్రజల్లో వచ్చిన ఈ మార్పు వ్యాపారస్తులకు.. ముఖ్యంగా ఫౌల్ట్రీ పరిశ్రమకు చెందిన వారికి కోట్లాది రూపాయిల నష్టం వాటిల్లేలా చేస్తోందట. ఒక అంచనా ప్రకారం తెలంగాణ ఫౌల్ట్రీ పరిశ్రమకు దగ్గర దగ్గర వెయ్యి కోట్ల నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణలో ఫౌల్ట్రీ బిజినెస్ లో తోపులుగా చెప్పే రాజకీయ నేతల్లో అధికార పార్టీకి చెందిన ఒక నేతకు కరోనా కారణంగా రూ.10కోట్ల మేర లాస్ వచ్చిందని చెబుతున్నారు. కరోనా మాయ ఏమో కానీ.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరికి దిమ్మ తిరిగే షాకిస్తుందని చెప్పక తప్పదు.