Begin typing your search above and press return to search.

రాజస్థాన్ చిత్తు..చిత్తు..సిక్స్ తో టాప్ ప్లేస్

By:  Tupaki Desk   |   15 Oct 2020 9:15 AM IST
రాజస్థాన్ చిత్తు..చిత్తు..సిక్స్ తో   టాప్ ప్లేస్
X
ఐపీఎల్లో భాగంగా ఢిల్లీ - రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. గత మ్యాచ్ లో ఓడినా ఈ మ్యాచ్ లో గెలిచి మొత్తం ఆరు విజయాలతో మళ్లీ అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. అటు బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ సత్తా చాటి విక్టరీ కొట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌(57; 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(53; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. మొదటి ఓవర్ మొదటి బాల్ కే ఓపెనర్ పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. రహానే(2), స్టోయినిస్‌(18), అలెక్స్‌ క్యారీ(14) నిరాశపరిచారు.

అనంతరం ఛేదనలో రాజస్తాన్‌ జట్టులో జోస్‌ బట్లర్‌(22;9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెన్‌ స్టోక్స్‌(41; 35 బంతుల్లో 6 ఫోర్లు) మెరుపులతో మంచి ఆరంభమే దక్కింది. రాజస్తాన్‌ జట్టు మూడు ఓవర్లలో 37 పరుగులు సాధించింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పోగొట్టుకుంది. స్టీవ్‌ స్మిత్‌(1) శాంసన్‌(25;18 బంతుల్లో 2 సిక్స్‌లు), రాబిన్‌ ఊతప్ప(32; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) కాసేపు మెరుపులు మెరిపించినా వెంటనే ఔట్ అయ్యారు. తెవాటియా(14 నాటౌట్‌) చివరి వరకూ క్రీజ్‌ లో ఉన్నా మ్యాచ్‌ను గెలిపించ లేకపోయాడు.ఇది ఢిల్లీకి ఆరో విజయం కాగా, రాజస్తాన్‌ కు ఐదో ఓటమి.


ఆర్చర్ ప్రతీ బాల్ 140 కిమీ స్పీడ్ తో

తొలి స్పెల్‌లో జోఫ్రా ఆర్చర్‌ ప్రతీ బంతిని 140 కిమీ పైనే స్పీడుతో వేయడం విశేషం. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన ఆర్చర్‌ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఓవర్లో పృథ్వీ షా, రెండో ఓవర్లో రహానే ను అవుట్‌ చేశాడు.

ఢిల్లీ సూపర్‌ బౌలింగ్‌

చివరి ఆరు ఓవర్లలో రాజస్తాన్‌కు 47 రన్స్‌ అసవరం అయ్యాయి. ఊతప్పతో పాటు తెవాటియా (18 బంతుల్లో 1 ఫోర్‌తో 18 నాటౌట్‌) ఉండడంతో ఆ జట్టు ఆశలు కోల్పోలేదు. కానీ, డెత్‌ ఓవర్లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.16వ ఓవర్లో అశ్విన్‌ రెండే పరుగులివ్వడంతో రాయల్స్‌పై ఒత్తిడి పెరిగింది.

18 వ ఓవర్లో ఊతప్పను బౌల్డ్‌ చేసిన అన్రిచ్‌ 4 పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్లో ఆర్చర్‌ వికెట్‌ తీసిన రబాడ 3 రన్సే ఇచ్చాడు. చివరి ఓవర్లో 22 రన్స్‌ అవసరం కాగా.. తుషార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులే వచ్చాయి.

కొంప ముంచిన మిడిల్

మిడిలార్డర్‌ ఫెయిల్యూర్‌ తో రాజస్థాన్ ఓటమి మూటగట్టుకుంది. 36 బంతుల్లో 47 పరుగులు అవసరమైన టైమ్‌ లో చేతి లో ఐదు వికెట్లున్నా చేజేతులా ఓడింది. రాహుల్‌ తెవాటియా లాస్ట్‌ బాల్‌ వరకూ క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు.

ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ ఫాస్ట్ బౌలర్ గా నోర్జే

ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన బౌలర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోర్జే (నోకియా) రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో గంటకు 156.22 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ఆశ్చర్యపరిచాడు.