Begin typing your search above and press return to search.

అశ్విన్​ తో బౌలింగ్​ చేయించకపోవడమే.. పంత్​ తప్పా?

By:  Tupaki Desk   |   16 April 2021 11:00 AM IST
అశ్విన్​ తో బౌలింగ్​ చేయించకపోవడమే.. పంత్​ తప్పా?
X
నిన్న రాజస్థాన్​ రాయల్స్​ తో తలపడ్డ ఢిల్లీ జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ ఓటమితో పంత్​ పై విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఢిల్లీ జట్టులో ఎంతో పటిష్ఠమైన బౌలర్లు ఉన్నారు. రబాడా లాంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అయితే నిన్న పంత్​ తీసుకున్న కొన్ని పొరపాటు నిర్ణయాలవల్లే జట్టు ఓడిపోయిందన్న వాదన బలంగా వినిపిస్తున్నది.

పంత్​ బౌలింగ్​ను సరైన క్రమంలో వేయించలేకపోయాడని.. కీలక టైంలో అశ్విన్​ కు కాకుండా వేరే బౌలర్లకు అవకాశం ఇవ్వడంతో ఢిల్లీ ఓటమి పాలైందన్న విమర్శలు వస్తున్నాయి. పంత్​ నిర్ణయాల పట్ల ఢిల్లీ హెడ్​ కోచ్​ రికీ పాంటింగ్​ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఓటమిపై పంత్​ మాట్లాడుతూ.. ’మేము ఆరంభంలో బాగానే బౌలింగ్​ వేశాం. కానీ చివర వరకు కొనసాగించలేకపోయాం. అందుకే మా జట్టు ఓడిపోయింది’ అంటూ వివరణ ఇచ్చాడు.

నిన్నటి మ్యాచ్​ లో తొలుత బ్యాటింగ్​ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 147 పరుగులు మాత్రమే చేసింది. బాట్స్​మెన్లు విఫలమయ్యారు. అయితే బౌలింగ్​ పరంగా ఎంతో పటిష్ఠంగా ఉన్న ఢిల్లీ తన మాయాజాలంతో మ్యాచ్​ ను గెలుస్తుందేమోనని అంతా భావించారు. మొదట్లో అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ బౌలర్లు ఎంతో పొదుపుగా ఓవర్లు వేశారు. కానీ రాను రాను.. రాజస్థాన్​ బ్యాట్స్​మన్లు చెలరేగి పోయారు. వాళ్లను కట్టడి చేయడంలో ఢిల్లీ బౌలర్లు ఫెయిల్​ అయ్యారని చెప్పక తప్పదు. ఇందుకు ప్రధాన కారణం పంత్​ కెప్టెన్సీయేనన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

డేవిడ్‌ మిల్లర్ ‌(62; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆట తీరుతో రాజస్థాన్‌లో ఆశలు చిగురించాయి. స్టోయినిస్‌ వేసిన 13 ఓవర్‌లో మిల్లర్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టి మంచి ఊపు తీసుకొచ్చాడు. మళ్లీ అవీష్‌ ఖాన్‌ వేసిన 16 ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడంతో రాజస్థాన్‌ వంద పరుగుల స్కోరును దాటింది. అశ్విన్​ మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ ఆఖర్లో అశ్విన్​కు బౌలింగ్​ కు అవకాశం ఇవ్వకపోవడంతో ఇలా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ అశ్విన్​ కు ఆఖర్లో అవకాశం ఇచ్చిఉంటే కీలక వికెట్లు పడేవని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.