Begin typing your search above and press return to search.

సైదాబాద్‌ హత్యాచార నిందితుడిపై ఆర్పీ పట్నాయక్‌ రూ. 50వేలు రివార్డు

By:  Tupaki Desk   |   15 Sep 2021 2:30 PM GMT
సైదాబాద్‌ హత్యాచార నిందితుడిపై ఆర్పీ పట్నాయక్‌ రూ. 50వేలు రివార్డు
X
హైదరాబాద్‌ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసి పారిపోయిన నిందితుడు పల్లంకొండ రాజు కోసం పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. ఈ సంఘటన జరిగిన దాదాపు వారం రోజులు కావొస్తున్నా నిందితుడు పట్టుబడకపోవడం గమనార్హం. ప్రస్తుతం 10 ప్రత్యేక పోలీస్ బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. ఇప్పటివరకూ అతని ఆచూకీ పై ఎలాంటి క్లూ పోలీసులకు లభించలేదు.

ఈ నేపథ్యంలోనే రాజు ఆచూకీ తెలియజెప్పేవారికి రూ.10లక్షలు ఇస్తామని రివార్డు ప్రకటించారు.తాజాగా టాలీవుడ్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సైతం నిందితుడిపై రివార్డు ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ ఆయన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ షేర్‌ చేశారు.

ఆర్పీ పోస్టు చేస్తూ.. చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితుడు రాజు దొరకాలి. అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. పట్టించిన వారికి నా వంతుగా రూ.50 వేలు ఇస్తాను. అతడు దొరకాలి. చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుంది. అతడు మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసు శాఖకు మన వంతు సాయం అందిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.

సైదాబాద్‌ చిన్నారి హత్యాచార ఘటన పై సినీ ప్రముఖులు గళమెత్తుతున్నారు. నిందితుడిని పట్టించడంలో పోలీసులకు సహకరిద్దాం అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక మంచు మనోజ్‌ సోమవారం బాధిత బాలిక కటుంబాన్ని పరామర్శించగా.. ఈ ఘటనపై సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు విచారణ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హీరో నాని నిందితుడు బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదంటూ ట్వీట్‌ చేశారు.

ఎన్నో క్లిష్టమైన కేసులను సైతం సునాయాసంగా డీల్ చేసి దేశంలోనే నంబర్.1 పోలీసింగ్ వ్యవస్థగా తెలంగాణ పోలీసులు పేరు తెచ్చుకున్నారు. అంతటి పేరున్న పోలీసులకు సైతం ఈ నిందితుడు చిక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే వాట్సాప్,ఫేస్‌బుక్,ఇతర సోషల్ మీడియా,టీవీలు,పత్రికల ద్వారా నిందితుడి ఫోటోలు జనంలోకి వెళ్లాయి. ప్రతీ చోటా దీని గురించే చర్చ జరుగుతోంది. నిందితుడు కనిపిస్తే పట్టివ్వడానికి జనం సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంతవరకూ రాజు ఆచూకీ దొరక్కపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి గత గురువారం (సెప్టెంబర్ 9) హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉండే రాజు అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రి అయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీనితో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ చిరు నవ్వుల తో ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ ఓ దుర్మార్గుడి దాష్టికానికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.