Begin typing your search above and press return to search.

విశాఖ నుంచి వారిని గెంటేస్తున్నారు...!

By:  Tupaki Desk   |   19 Jun 2023 9:00 AM GMT
విశాఖ నుంచి వారిని గెంటేస్తున్నారు...!
X
విశాఖ సిటీ అంటే స్మార్ట్ సిటీ అని పేరు. సిటీ ఆఫ్ డెస్టినీ అని పర్యాయపదం ఉంది. విశాఖ శరవేగంగా ఎదురుగున్న నగరం. ఈ సిటీలో ఇటీవల కాలంలో చూసుకుంటే నేరాలు ఘోరాలు ఎక్కువ అయ్యాయి. విపక్షాలు అన్నీ విశాఖ అరాచకాల అడ్డా అంటున్నారు. సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి విశాఖ నడిబొడ్డున జరిగిన సభలో మాట్లాడుతూ విశాఖ అరాచక మయం అనేశారు.

టీడీపీ బీజేపీ జనసేన సహా అన్ని పార్టీలు విశాఖలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నాయని విమర్శిస్తున్నారు. ఇదొక పొలిటికల్ ఇష్యూ అయిపోతోంది. దాంతో ఇపుడు ప్రభుత్వం మీద వత్తిడి బాగా పెరిగింది. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే మకాం పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.

ఎన్నికల వేళ విశాఖకు రాజధాని షేపూ రూపూ అలా ఇస్తే కనుక అది వైసీపీ రాజకీయానికి ఎంతో ఉపయోగపడుతుందని జగన్ వ్యూహరచన చేస్తున్నారు. అయితే విశాఖలో కిడ్నాపులు, మర్డర్లు పెద్ద ఎత్తున ఎక్కువ అయిపోయాయని టీడీపీ నేతలు అంటున్నారు. విశాఖలో ఒక ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుడి సంగతి ఏంటి అని నిలదీస్తున్నారు.

ఈ నేపధ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విశాఖ పోలీసులు యాక్షన్ లోకి దిగిపోయారని అంటున్నారు. విశాఖలో రౌడీ షీటర్లను ఏరి పారేయాలని కమిషనర్ త్రివిక్రమ్ వర్మ కీలక సమావేశాన్ని అధికారులతో ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో ఉండేందుకు వారు అనర్హులు అంటూ ఆయన ఫైర్ అయ్యారని టాక్.

విశాఖలో రౌడీ షీటర్లను బహిష్కరించాలని నగర పోలీస్ కమిషనరేట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అంతే కాదు నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల కేసుల వివరాలను కూడా ఈ సమావేశంలో పరిశీలించారు. వారిపైన గట్టి నిఘా ఉంచడంతో పాటు విశాఖ భద్రతతో పాటు స్వేచ్చకు భంగం కలిగించే రౌడీ షీటర్లను నగర బహిష్కరణ చేయాలని డిసైడ్ అయ్యారు.

విశాఖలో దాదాపుగా నాలుగు వందల మంది దాకా రౌడీ షీటర్లు ఉంటారని అంటున్నారు. వీరి మీద పోలీస్ నిఘా తగ్గడంతోనే నేరాలు ఊపందుకున్నాయని అంటున్నారు. రౌడీ షీటర్లు గతంలో పోలీస్ స్టేషన్ కి ఠంచనుగా వచ్చి రిజిష్టర్ లో సంతకం పెట్టి వెళ్లేవారు. వారి కదలికల మీద ఎప్పటికపుడు అలెర్ట్ ఉండేది.

ఇటీవల కాలంలో అది లేకుండా పోయిందని ఫలితంగా హత్యలు ఎక్కువ అయ్యాయని, ఇపుడు కిడ్నాపులు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. మొత్తానికి విశాఖ ఎంపీ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ తో అయినా రౌడీ షీటర్ల భరతం పట్టేందుకు పోలీసులు ఊద్యమిస్తే కనుక అది కచ్చితంగా విశాఖ సిటీకి మేలు చేసే వ్యవహారం అవుతుందని అంటున్నారు. మరి మాటలలో ఉన్న వేడి చేతలలో పోలీసులు రుజువు చేసుకోవడం మీదనే ఇది ఆధారపడి ఉంటుంది అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా రౌడీ షీటర్లను ఏరివేయాలని కోరుతున్నారు.