Begin typing your search above and press return to search.

ప్రేమ‌కు నో చెప్పింద‌ని ఎయిర్ హోస్టెస్ చెవి కోసేశాడు

By:  Tupaki Desk   |   17 May 2019 6:19 AM GMT
ప్రేమ‌కు నో చెప్పింద‌ని ఎయిర్ హోస్టెస్ చెవి కోసేశాడు
X
మ‌రో దారుణం వెలుగు చూసింది. ప్రేమిస్తున్నానంటూ వెంట ప‌డుతున్న ఒక రౌడీకి నో చెప్పినందుకు ఒక ఎయిర్ హోస్టెస్ చెవిని క‌త్తిరించిన వైనం తాజాగా వెలుగు చూసింది. క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న ఈ దురాగ‌తం వింటేనే ఒళ్లు జ‌ల‌ద‌రించ‌టం కాయం. కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఉదంతం గురించి తెలిస్తే.. అయ్యో అనాల్సిందే. అస‌లేం జ‌రిగిందంటే..

బెంగ‌ళూరుకు చెందిన ఒక ఎయిర్ హోస్టెస్ ఇండిగో ఎయిర్ లైన్స్ లో ప‌ని చేస్తుంటారు. ఆమెను జాల‌హ‌ళ్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉండే రౌడీషీట‌ర్ అజ‌య్ అలియాస్ జాకీ ప్రేమిస్తున్నానంటూ వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. అత‌గాడి ల‌వ్ ప్ర‌పోజ‌ల్ ను ఆమె రిజెక్ట్ చేయ‌ట‌మే కాదు.. ఇంట్లో వారికి చెప్పింది.

దీంతో ఆగ్ర‌హానికి గురైన ఎయిర్ హోస్టెస్ కుటుంబ స‌భ్యులు.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసుల నుంచి హెచ్చ‌రిక‌లు అందాయి. దీంతో ప‌గ‌తో ర‌గిలిపోయిన స‌ద‌రు రౌడీ షీట‌ర్ జాకీ.. ఆమెను మ‌రింత‌గా వేధించ‌టం మొద‌లు పెట్టాడు. త‌న‌పై కంప్లైంట్ చేశార‌న్న కోపంతో వారి ఇంటి ముందు వీరంగం సృష్టించాడు. దీంతో.. పోలీసులు మ‌రోసారి అత‌డ్ని హెచ్చ‌రించారు.

ఈ నేప‌థ్యంలో ఎయిర్ పోర్ట్ కు వెళుతున్న ఎయిర్ హోస్టెస్ కారును అడ్డుకున్న జాకీ.. డ్రైవ‌ర్ ను బెదిరించాడు. దీనికి స‌ద‌రు డ్రైవ‌ర్ మాట విన‌క‌పోవ‌టంతో త‌న ద‌గ్గ‌రున్న క‌త్తితో భుజం మీద కోశాడు. అనంత‌రం.. ఎయిర్ హోస్టెస్ చెవిని క‌త్తిరించి.. అక్క‌డి నుంచి పారిపోయాడు. గాయాల‌పాలైన ఆమె.. ఆసుప‌త్రిలోచికిత్స పొందుతున్నారు. కొడిగెహ‌ళ్లి పోలీస్ స్టేష‌న్లో చోటు చేసుకున్న ఈ దారుణం నేప‌థ్యంలో.. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.