Begin typing your search above and press return to search.

సినిమా స్టైల్లో తప్పించుకున్న గ్యాంగస్టర్ ను లేపేశారు

By:  Tupaki Desk   |   28 Feb 2020 4:30 PM IST
సినిమా స్టైల్లో తప్పించుకున్న గ్యాంగస్టర్ ను లేపేశారు
X
సినిమాల్లో కనిపించే సీన్లు కొన్ని ఇటీవల కాలంలో రియల్ లైఫ్ లోనూ దర్శనమిస్తున్నాయి. ఆ కోవకు చెందినదే తాజా ఎపిసోడ్. గార్డెన్ సిటీ బెంగళూరును అడ్డాగా చేసుకొని హత్యలు.. కిడ్నాప్ లు.. భూకబ్జాలు.. వసూళ్లు.. ఇలా ఒకటేమిటి? భారీ నేరం ఏదైనా సరే.. వెనకుండే మాస్టర్ మైండ్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ‘‘స్లం భరత్’’. అతగాడ్ని తాజాగా సినీ ఫక్కీలో ఎన్ కౌంటర్ చేసేశారు. సంచలనంగా మారిన ఇతగాడి వ్యవహరం మొత్తం వింటే ఇలాంటి క్యారెక్టర్లు రీల్లో తరచూ కనిపిస్తూ ఉంటాయి.

150 మంది అనుచరులు.. తానేం కోరుకుంటే అది జరగాలన్న పట్టుదల.. తాను కోరుకున్నది సొంతం కావాలన్న మొండితనంతో పాటు.. తన మాట వినని వారిని ఎంతకైనా సరే వేధించటం.. దౌర్జన్యం చేయటం.. అసరమైతే హత్య చేసేందుకు వెనుకాడని తత్త్వం భరత్ సొంతం. ఇతగాడి మీద యాభైకి పైగా కేసులు ఉన్నాయి. బెంగళూరు మహానగరంలో ఇతగాడి లొల్లి నిత్యం అక్కడి పోలీసుల్ని వెంటాడుతూ ఉంటుంది. పెద్ద పెద్ద నేరాల్లో అతగాడి ప్రస్తావన తరచూ వస్తుంటుంది.

ఇదిలా ఉంటే.. 20 రోజుల క్రితం పుట్టిన రోజు వేడుకల్లో ఫుల్ గా తాగేసిన భరత్.. సుబ్రమణ్యనగర సీఐ.. ఎస్ ఐలను వాహనంతో ఢీ కొట్టి పరారయ్యాడు. సీరియస్ అయిన పోలీసులు వెతుకులాట షురూ చేశారు. పోలీసుల మీదే దాడి చేసేంతగా ముదిరిన ఇతగాడి సంగతి చూసేందుకు ప్రత్యేకంగా రంగంలోకి దిగాడు. పారిపోయిన భరత్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేకంగా ఫోర్స్ వెళ్లి అతడ్ని అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తీసుకొచ్చారు.

ఇక్కడి వరకూ కథ రోటీనే అయినా.. ఇక్కడే లెక్క తేడా వచ్చేసింది. యూపీ నుంచి భరత్ ను తీసుకొస్తున్న పోలీసు వాహనంపై అతగాడి గ్యాంగ్ దాడికి తెగబడింది. పోలీసు వాహనాన్ని వేరే వాహనంతో ఢీ కొనటమే కాదు.. కొడవళ్లు.. పెద్ద కత్తులతో దాడికి దిగారు. సినిమాల్లో మాదిరి తమ నాయకుడు భరత్ ను తీసుకొని వెళ్లిపోయారు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

నగరవ్యాప్తంగా వెళ్లే అన్ని మార్గాల్ని అలెర్ట్ చేశారు. నగరాన్ని జల్లెడ పడుతున్న పోలీసులకు భరత్ అండ్ టీం హెసరఘట్ట చెరువు వద్ద సోలదేవనహళ్లి సమీపంలోని కారులో భరత్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేయగా.. అతడి అనుచరులు కాల్పులు జరిపారు. దీంతో.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఇలా ఇరువర్గాల మధ్య సాగిన కాల్పుల్లో భరత్ మరణించాడు. అతడికి చెందిన పది మంది అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనేక మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అండర్ వరల్డ్ డాన్ గా అవతరించాలని కలలు కన్న భరత్ ను బెంగళూరు పోలీసులు ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు.