Begin typing your search above and press return to search.

అదేంటి ద్రౌపతి అలా కొట్టేశావ్

By:  Tupaki Desk   |   25 April 2016 3:40 PM IST
అదేంటి ద్రౌపతి అలా కొట్టేశావ్
X
పశ్చిమబెంగాల్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. మహాభారత్ సీరియల్ లో ద్రౌపతి పాత్రధారి రూపాగంగూలీ బీజేపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగటం తెలిసిందే. బెంగాల్ రాష్ట్ర అధికారపక్షం తృణమూల్ కాంగ్రెస్ కు.. బీజేపీ మధ్య పోటాపోటీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన అంచనాల ప్రకారం బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ వాదనల నేపథ్యంలో బీజేపీ నేతలు గెలుపు కోసం మరింతగా శ్రమిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. నాలుగోదశ ఎన్నికల్లో భాగంగా ద్రౌపతి పాత్రధారి రూపాగంగూలీ హౌరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు పోలింగ్ బూత్ లకు వెళ్లిన ఆమెకు.. తృణమూల్ కాంగ్రెస్ నేతలతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త తీవ్రం కావటంతో సహనం కోల్పోయిన రూపాగంగూలీ ఆగ్రహంతో చేయి చేసుకోవటం సంచలనంగా మారింది.

తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తపై చేయి చేసుకున్న రూపా గంగూలీ.. మరో కార్యకర్తను తోసేయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అధికారపార్టీ సభ్యుడిపై చేయి చేసుకున్న రూపాగంగూలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంత గొడవ అయితే మాత్రం.. అలా సహనం కోల్పోయి చేయి చేసుకోవటం ఏంటి ద్రౌపతి..?