Begin typing your search above and press return to search.

వైసీపీలో ఢీ అంటే ఢీ అంటున్న బాబాయ్, అబ్బాయ్‌!

By:  Tupaki Desk   |   20 May 2023 2:34 PM GMT
వైసీపీలో ఢీ అంటే ఢీ అంటున్న బాబాయ్, అబ్బాయ్‌!
X
వైసీపీకి కంచుకోట జిల్లాల్లో ఒకటి.. నెల్లూరు. ఇక్కడ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పదికి పది స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. నెల్లూరు లోక్‌ సభ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేసింది. అలాంట కీలకమైన జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి జెల్లకొట్టిన సంగతి తెలిసిందే. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ వారిని బహిష్కరించింది.

కాగా నెల్లూరు సిటీలో ఇప్పుడు డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌ యాదవ్, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ లు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. స్వయంగా బాబాయి, అబ్బాయిలైన వీళ్లిద్దరూ మధ్య భేదాభిప్రాయాలతో పార్టీ కేడర్‌ తలపట్టుకుంటోందని అంటున్నారు.

ఇప్పటికే బాబాయి రూప్‌ కుమార్‌ యాదవ్, అబ్బాయి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మీడియా ముఖంగానే సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. వైఎస్‌ జగన్‌ కు సైతం ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌ అనుచరుడు, వైసీపీ విద్యార్థి నేత హాజీపై మే 19న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం హాజీ నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాజీని రూప్‌కుమార్‌ యాదవ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా తన అనుచరుడిపై జరిగిన దాడిపై రూప్‌ కుమార్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి హాజీ పార్టీలో ఉన్నారన్నారు. హాజీపై కత్తులతో హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. కేవలం తనకు మద్దతు ఇస్తున్నాడనే కక్షతోనే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు చెబుతున్నట్టు ఈ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఉన్నారని రూప్‌ కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదన్నారు.

గతంలోనూ తన అనుచరులపై ఇలాగే దాడులు చేశారని రూప్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ మరోసారి దాడి జరిగి ఉండేది కాదన్నారు. ఇకపై తన కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాను ప్రతీకారం మొదలుపెడితే ఊహకు కూడా అందదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనను సీఎం జగన్, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్నారు. నెల్లూరులో వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ తీరుపై ఆయన బాబాయ్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌ పద్యం రూపంలో విమర్శలు గుప్పించారు. వేమన పద్యాన్ని ఉదహరిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

''అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన..

దొడ్డవారినెల్ల తొలగగొట్టు..

చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా..

విశ్వదాభిరామ! వినుర వేమ!!''... అని ధ్వజమెత్తారు.