Begin typing your search above and press return to search.

యూనివర్సిటీ స్టూడెంట్ లపై జగన్ కన్ను

By:  Tupaki Desk   |   17 Sept 2015 10:30 PM IST
యూనివర్సిటీ స్టూడెంట్ లపై జగన్ కన్ను
X
ఏపీలో విపక్ష వైసీపీ అధినేత జగన్ తన రాజకీయ మిత్రుడు కేసీఆర్ మార్గంలో సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణలోని విశ్వవిద్యాలయ విద్యార్థులను తన ప్రధాన అస్త్రాలుగా మలచుకున్న కేసీఆర్ చూపిన మార్గంలోనే జగన్ పయనించనున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు ఉస్మానియా, కాకతీయ వంటి విశ్వవిద్యాలయాల విద్యార్థులు కొండంత అండగా నిలిచారు. ఆ యూనివర్సిటీల కేంద్రంగా రాజకీయాలు - ఉద్యమాలు - పోరాటాలు నడిచాయి. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలోనూ జగన్ అలాగే చేయాలనుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు చూపిస్తున్నారు.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు రెండు రోజుల కిందట ''ఏపీ ప్రత్యేక హోదా.. ఉద్యోగ అవకాశాలు.. రాష్ట్రాభివృద్ధి'' అనే అంశంపై యువభేరీ సదస్సు నిర్వహించగా జగన్ పాల్గొని విద్యార్థులను ఆకట్టుకునేలా మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు కూడా. హోదా అవసరం.. దాని ప్రయోజనాలు విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. దాన్ని ప్రజలకు వివరించాలనీ అన్నారు. అదే విధంగా రిషికేశ్వరి మృతి ఘటన పైనా వైసీపీ స్పందించింది. వైసీపీ ఎమ్మెల్యే రోజారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ బృందం నాగార్జున వర్సిటీకి వెళ్లింది. ఇవన్నీ ఆ పార్టీ యూనివర్సిటీ స్టూడెంట్లపై కన్నేసిందనడానికి ఉదాహరణ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేక హోదా అంశం.. జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లి యూనివర్సిటీల్లో విద్యార్థులను కదిలించి ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ ప్లాను చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా త్వరలో జగన్ హోదా కోసం దీక్ష చేయనున్న నేపథ్యంలోనూ వ్యూహాత్మకంగానే ప్రత్యేక హోదా అంశాన్ని వర్సీటీల స్థాయి నుంచి బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ అనుభవాలను జగన్ ఉపయోగించుకుంటూ రాజకీయంగా ఫోర్సులో ఉండాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.