Begin typing your search above and press return to search.

బాలయ్యకు అభయమిచ్చిన రోజా.. ఏంటంటే?

By:  Tupaki Desk   |   3 Jun 2020 4:15 AM GMT
బాలయ్యకు అభయమిచ్చిన రోజా.. ఏంటంటే?
X
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, ఏపీ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) చైర్‌పర్సన్ రోజా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలక్రిష్ణకు అభయమిచ్చారు. ఆయనకు సాయం చేస్తానని మాట ఇచ్చారు. బాలయ్య కోరికల చిట్టాలపై చర్చిస్తానన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలుగుదేశం పార్టీ అన్నా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నా ఒంటికాలిపై లేచి చెడామడా తిట్టేస్తుంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా.. రోజాను చంద్రబాబు చాలా హింసించారనే పేరుంది. అందుకే ఇప్పుడు రోజా సమయం సందర్భం వస్తే చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తుంటుంది.

అయితే టీడీపీని, ఆ ఎమ్మెల్యేలను నరనరాన వ్యతిరేకించే రోజా ఆ పార్టీకే చెందిన చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలక్రిష్ణపై మాత్రం అభిమానం చూపిస్తుంటారు. సినీ పరిశ్రమలో మొదట్లో బాలయ్యతో రోజా ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సాన్నిహిత్యం మునుపటి అనుబంధం వల్ల రోజా ఏనాడు బాలక్రిష్ణను విమర్శించరు. అసెంబ్లీ లాబీలో కలిసినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఆ మధ్య మూడు రాజధానుల బిల్లుపై శాసనమండలిలో చర్చ సందర్భంగా గ్యాలరీలో బాలయ్యతో రోజా తీసుకున్న సెల్ఫీ కూడా వైరల్ అయ్యింది.

అయితే తాజాగా బాలక్రిష్ణ కూడా రోజా గురించి ఆసక్తికర విషయాలు తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇటీవల ఏపీఐఐసీ చైర్మన్ అయిన రోజాను కలిసానని.. తన సొంత నియోజకవర్గం హిందూపూర్‌లో పారిశ్రామిక ఎస్టేట్ అభివృద్ధికి రోజాను సహాయం కోరానని బాలక్రిష్ణ తెలిపారు. తన తండ్రి ఎన్ టి రామారావు పాలనలో హిందూపూర్ కు పారిశ్రామిక ఎస్టేట్ వచ్చిందని వివరించారు.

రోజా కూడా ఎంతో సానుకూలంగా సాయం చేస్తానని హామీ ఇచ్చిందని బాలయ్య తెలిపారు. ’’మేము ఖచ్చితంగా పారిశ్రామిక ఎస్టేట్ ను హిందూపురంలో అభివృద్ధి చేస్తామని.. నేను సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని.. మరియు మీరు కూడా సమావేశానికి హాజరుకావచ్చు ” అని ఎపిఐఐసి చైర్‌పర్సన్ రోజా తనకు అభయమిచ్చారని బాలయ్య గుర్తు చేసుకున్నారు.

రోజా నిర్వహించే ఆ సమావేశానికి తాను ఖచ్చితంగా హాజరవుతానని పేర్కొన్న బాలక్రిష్ణ టిడిపి అధికారంలో లేనప్పటికీ ఎవరితోనూ తనకు ఎలాంటి సమస్య లేదని చెప్పడం కొసమెరుపు. రోజాతోనూ తన నియోజకవర్గ సమస్యలపై చర్చించానని బాలయ్య వివరించారు.

హిందూపురం బెంగళూరుకు దగ్గరగా ఉన్నందున పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయని బాలయ్య అన్నారు. హిందూపురంలో బయోపార్క్ ఉందని.. దానిని అభివృద్ధి చేయాలని రోజాకు ప్రతిపాదించానని.. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తానని బాలయ్య వివరించారు.