Begin typing your search above and press return to search.

పేదల్లో ఒకరిగా.. రోజా సేవకు ప్రశంసలు

By:  Tupaki Desk   |   30 Nov 2018 4:18 PM IST
పేదల్లో ఒకరిగా.. రోజా సేవకు ప్రశంసలు
X
ప్రార్ధించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అంటారు పెద్దలు.. ఒక ప్రభుత్వం చేస్తున్న పనిని.. ఒక సాధారణ మహిళా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది.. తను వివిధ టీవీ షోల ద్వారా సంపాదించిన మొత్తం నుంచి ట్రస్ట్ ఏర్పాటు చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ మొబైల్ క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. దాని ద్వారా నాణ్యమైన భోజనాన్ని రూ.4కే అందిస్తోంది. ఎంతో రుచికరమైన - నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందిస్తూ వారి కడుపునింపుతోంది. ఆవిడే ఏపీ వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా..

ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల పేరుతో ఊరు గొప్ప.. పేరు దిబ్బ అన్న చందాన మొక్కుబడిగా నడుపుతున్న భోజనశాలలు నాణ్యంగా లేవని ఎన్నో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.. అలా నాసిరకంగా కాకుండా నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందించాలని రోజా యోచించారు. ఆ ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్నదే ‘వైఎస్ ఆర్ క్యాంటీన్లు’.

అలా మెదిలిన ఆలోచనల్లోంచే వైసీపీ ఎమ్మెల్యే రోజా.. పేదల ఆకలి తీర్చేందుకు నడుం బిగించారు. ఇందుకోసం ప్రభుత్వ నిధులను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. తను పార్ట్ టైం పనిచేస్తున్న టీవీ రంగం నుంచి వచ్చిన పారితోషకాన్ని పేదల ఆకలితీర్చేందుకు ఖర్చు చేస్తున్నారు. కేవలం రూ.4కే రోజూ తీరొక్క కూర - అన్నం - వివిధ టిఫిన్స్ ను రోజూ వివిధ వెరైటీలను కలగలపి అతితక్కువ ధరలో అత్యంత నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ పేదల కడుపు నింపుతున్నారు..

ఎమ్మెల్యే రోజా రూ4కే అందిస్తున్న భోజనాన్ని తిన్న పేదలు.. అన్న క్యాంటీన్ అన్నం ఎందుకు పనికి రాదని విమర్శలు గుప్పిస్తున్నారు. పేదల కోసం ఇంత నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న రోజా సేవలను కొనియాడుతున్నారు..

తాజాగా ఎమ్మెల్యే రోజా ఏర్పాటు చేసిన క్యాంటీన్లలో భోజనాన్ని స్వయంగా తిని పరిశీలించారు. నగరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రజలతో కలిసి ఎమ్మెల్యే రోజా సహపంక్తి భోజనం చేశారు. పేదల్లో ఒకరిగా కలిసిపోయి విగ్రహం ఎదుట గద్దె పైన మామూలు సామాన్యురాలిలా రోజా భోజనం చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. రోజా లాంటి ప్రజా నాయకురాలు నియోజకవర్గానికి ఒక్కరుంటే చాలు అని కీర్తిస్తున్నారు. పేదల ఆకలి తీర్చడం కోసం సొంతం క్యాంటీన్లను ఏర్పాటు చేసిన రోజా ప్రజాసేవపై ప్రశంసలు కురుస్తున్నాయి.