Begin typing your search above and press return to search.

రోజా బర్త్ డే స్పెషల్.. రాజన్న క్యాంటీన్లు

By:  Tupaki Desk   |   17 Nov 2018 12:00 PM IST
రోజా బర్త్ డే స్పెషల్.. రాజన్న క్యాంటీన్లు
X
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. పుట్టిన రోజులకు - పెళ్లి రోజులకు చాలా మంది ఆడంబరాలకు పోతుంటారు కొందరు రాజకీయ నేతలు. అందుకు భిన్నంగా పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ముందుకు వచ్చారు నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా. రూ.4కే భోజనం అందించి పేదల ఆకలి తీర్చేందుకు నడుంబిగించారు.

నవబంరు 17న రోజా పుట్టిన రోజు. పేదల మనిషిగా ఖ్యాతి కెక్కిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడలలో పయనించేందుకు రోజా పుట్టిన రోజు సందర్భంగా ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తున్నానని చెబుతున్న ఆమె.. పేదలకు పట్టెడన్నం పెట్టాలని తలంచారు. అందుకోసం రూ. 4కే భోజనం అందించేందుకు రాజన్న క్యాంటీన్ ను ప్రారంభించబోతున్నారు. ప్రతి రోజు రెండు కూరలు వెరైటీగా తయారు చేసి వడ్డిస్తామని ఆమె చెబుతున్నారు.

రాజన్న క్యాంటీన్ పేరుతో ఇప్పటికే మరో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేదలకు రూ.4కే భోజనం అందజేస్తున్నారు. ఇది బాగా ఆదరణ పొందింది. టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్ ఒక పక్క వెలవెలబోతుండగా - ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభించిన రాజన్న క్యాంటీన్ కిటికిటలాడుతోంది . భోజనం - కూరలు కూడా రుచిగా ఉండటమే పేదల మనసులను గెలుచుకోవడానికి ముఖ్య కారణమని ఆయన చెబుతున్నారు. ఎవరు పేదల కోసం పనిచేస్తున్నారో ప్రజలు గ్రహిస్తున్నారని అంటున్నారు.

తాజాగా రోజా ప్రారంభిస్తున్న రాజన్న క్యాంటీన్ లో భాగంగా రెండు మొబైల్ క్యాంటీన్ వాహనాలు సిద్ధం చేశారు... ఆ తరువాత మరో రెండు వాహనాలు ప్రారంభిస్తానని రోజా తెలిపారు. రోజా ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో నిధులు సమకూర్చునున్నట్లు ఆమె వివరించారు.