Begin typing your search above and press return to search.

'నంద్యాల దెబ్బ‌కు చంద్ర‌బాబు అబ్బా అనాలి'

By:  Tupaki Desk   |   3 Aug 2017 1:36 PM GMT
నంద్యాల దెబ్బ‌కు చంద్ర‌బాబు అబ్బా అనాలి
X
అస‌లే ఫైర్ బ్రాండ్‌. దానికి ఆవేశం జ‌త క‌లిస్తే..? ఎలా ఉంటుందో వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఆర్కే రోజా తాజా మాట‌ల తూటాలు వింటే ఇట్టే అర్థ‌మైపోతుంది. న‌ంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో నేంద్యాల‌లోని ఎస్పీజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అస‌లు బాబుకు ఓటు ఎందుకు వేయాలంటూ సూటిగా ప్ర‌శ్నించిన ఆమె.. మ‌రోసారి బాబుకు ఓటేస్తే ఆరాచ‌కం రాజ్య‌మేలుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ రోజున వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని అంద‌రూ గుర్తుంచుకోవాల్సిన రోజు అని.. త‌న తండ్రి కోసం న‌ల్ల‌కాలువ వ‌ద్ద‌కు వైఎస్ జ‌గ‌న్ వ‌చ్చిన సంద‌ర్భాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. ఎన్ని క‌ష్టాలు పెట్టినా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ ను గుర్తుంచుకోవాల‌న్నారు. అన్ని పార్టీలు క‌లిసి జ‌గ‌న్ పై క‌క్ష క‌ట్టి కేసులు పెట్టార‌న్నారు.

అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌లేద‌ని.. ప్ర‌జ‌ల కోసం పోరాటం ఆప‌లేద‌న్నారు. ఎందుకంటే.. వైఎస్ జ‌గ‌న్ రాయ‌ల‌సీమ ముద్దుబిడ్డ అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పౌరుషం.. నాటి వైఎస్ మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే జ‌గ‌న్ మాట త‌ప్ప‌లేదు.. మ‌డ‌మ త‌ప్ప‌లేద‌న్నారు.

అస‌లీ రోజున ఎన్నిక‌లు ఎందుకు వ‌చ్చాయ‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌లు ఆలోచించాల‌న్నారు. 21 మంది ఎమ్మెల్యేల్ని ప‌శువుల్లా కొనుగోలు చేసి ప్ర‌జాస్వామ్యాన్ని తూట్లు పొడ‌వ‌టం వ‌ల్లే ఎన్నిక‌లు వ‌చ్చాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డి భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్లార‌ని.. అయితే.. ఆయ‌న‌కు ఏ ప‌ద‌వీ ఇవ్వ‌కుండా చివ‌ర‌కు గుండెపోటు వ‌చ్చేలా చేశార‌న్నారు.

నంద్యాల గ‌డ్డ వైఎస్ రాజ‌శేఖ‌ర్ అడ్డా అని 2004లో రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ముఖ్య‌మంత్రి చేయాల‌ని గెలిపించిన గ‌డ్డ అని.. 2009లో వైఎస్సార్ పాల‌న‌ను చూసి గెలిపించిన గ‌డ్డ అని.. 2014లో వైఎస్ జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌న్న ఉద్దేశంతో ఓటు వేసిన గ‌డ్డగా అభివ‌ర్ణించారు. నంద్యాలలో జ‌రిగిన అభివృద్ధి మొత్తం వైఎస్ హ‌యాంలోనే జ‌రిగింద‌ని.. బాబుకు ఓటు వేస్తే.. అవినీతికి ఓటు వేసిన‌ట్లేన‌న్నారు.

చంద్ర‌బాబుకు ఓటు వేస్తే కుంభ‌కోణాల‌కు.. రైతుల ఆర్త‌నాదాల్ని ప‌ట్టించుకోకుండా ఓటు వేసిన‌ట్లే అవుతుంద‌న్నారు. ఇప్ప‌టికీ ఓటు వేస్తే.. ఆరాచ‌కం.. అవినీతి రాజ్య‌మేలుతుంద‌న్నారు. నంద్యాల ఉప ఎన్నిక సాధార‌ణ ఉప ఎన్నిక కాద‌ని.. ఏపీ రాష్ట్ర భ‌విష్య‌త్తును మార్చే ఎన్నిక‌లన్నారు.

రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు నంద్యాల ప్ర‌జ‌లు బుద్ది చెప్పాల‌న్నారు. రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన చంద్ర‌బాబుకు నంద్యాల దెబ్బ‌తో అబ్బా అనాల‌న్నారు. మూడేళ్లుగా ద‌గా ప‌డ్డామ‌ని.. చంద్ర‌బాబు అంటేనే అవినీతికి ఆధార్ కార్డు.. ఆరాచ‌కాల‌కు పాన్ కార్డుగా దుయ్య‌బ‌ట్టారు. ఆ కార్డుల‌న్నింటినీ ఓట‌రుకార్డుతో చింపేయాల‌న్నారు. చంద్ర‌బాబుకు దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించాల‌న్నారు. మ‌హిష్మ‌తి బ‌హుబ‌లిదేన‌ని.. నంద్యాల వైఎస్సార్ కాంగ్రెస్ దేన‌న్నారు.