Begin typing your search above and press return to search.

బాబు.. బీజేపీ బంధం షురూ అయ్యిందా?

By:  Tupaki Desk   |   29 April 2018 12:31 PM IST
బాబు.. బీజేపీ బంధం షురూ అయ్యిందా?
X
బంధం అనేది మొద‌లుకాకూడ‌దు. ఒక‌సారి మొద‌ల‌య్యాక‌.. అది మ‌ధ్య‌లో తెగిన‌ప్ప‌టికీ.. పాత అనుబంధానికి సంబంధించిన గురుతులు చెరిగిపోవు. కొన్నిసంద‌ర్భాల్లో తెగిన బంధాలు సైతం అతుక్కుంటాయి. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.. బీజేపీకి మ‌ధ్య బంధం తెగినట్లు క‌నిపించినా.. మ‌ళ్లీ వారి మ‌ధ్య బంధం కొత్త‌గా మొద‌లైంద‌న్న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను చేశారు ఏపీ విప‌క్ష ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.

మ‌రోసారి బీజేపీతో క‌లిసేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క‌మ్ సినీ న‌టి ఆర్కే రోజా. హోదా విష‌యంపై ప్ర‌జ‌ల్ని త‌న వైపున‌కు తిప్పుకునేందుకు వీలుగా బాబు నాట‌కాలు ఆడుతున్నార‌ని.. బీజేపీతో ఆయ‌న బంధం తెగ‌తెంపులు చేసుకున్న‌ట్లు క‌నిపించినా అది నిజం కాద‌న్నారు. కావాలంటే తాను సాక్ష్యం చూపిస్తాన‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల టీటీడీ బోర్డుకు స‌భ్యుల్ని ఎంపిక చేసిన వైనాన్ని గుర్తు చేసిన ఆర్కే రోజా.. ఆ జాబితాలో మ‌హారాష్ట్రకు చెందిన ఒక మ‌హిళ‌కు అవ‌కాశం క‌ల్పించార‌ని.. ఆమె ఎవ‌రో కాద‌ని.. మ‌హారాష్ట్ర మంత్రి స‌తీమ‌ణిగా రోజా వెల్ల‌డించారు. ఈ ఒక్క ఉదంతం చాలు.. బీజేపీ.. బాబు మ‌ధ్య బంధం కొన‌సాగుతుంద‌ని చెప్ప‌టానికి అని వ్యాఖ్యానించారు.

గ‌డిచిన నాలుగేళ్ల‌లో టీటీడీ బోర్డులో ఒక్క బీజేపీ నేత‌ను నియ‌మించ‌ని చంద్ర‌బాబు.. ఇప్పుడు ఆ ప‌ని చేయటం ఏమిట‌ని? ప్ర‌శ్నించారు. బాబు తాజా నిర్ణ‌యం చూస్తే..బాబుకు.. బీజేపీకి మ‌ధ్య ప్యాచ‌ప్ జ‌రిగింద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

కుట్ర‌కు పేటెంట్ రైట్ చంద్ర‌బాబేన‌ని.. నాలుగేళ్లు కేంద్రంలో ఎన్నో ప‌ద‌వులు అనుభ‌వించి.. ఈ రోజు హోదా అంశంపై మాట్లాడుతున్న చంద్ర‌బాబు.. ప్ర‌త్యేక హోదా అంశాన్ని గ‌తంలోనే కేంద్రం ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టార‌న్నారు. రాజ‌కీయ విలువ‌ల్లేని చంద్ర‌బాబు న‌మ్మ‌క‌ద్రోహిగా ఆమె అభివ‌ర్ణించారు.