Begin typing your search above and press return to search.

ఓటుకు నోటులో కొత్త కోణాన్ని చెప్పిన రోజా

By:  Tupaki Desk   |   9 May 2018 2:58 PM IST
ఓటుకు నోటులో కొత్త కోణాన్ని చెప్పిన రోజా
X
మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓటుకు నోటు కేసు ముచ్చ‌ట తెర మీద‌కు వ‌చ్చింది. ఈసారి ఈ ముచ్చ‌ట‌ను స్వ‌యంగా ట‌చ్ చేసింది బాబుకు క్లోజ్ ఫ్రెండ్ గా చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆరే. తాజాగా ఆయ‌న పోలీసు ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి ఓటుకు నోటు కేసుకు సంబంధించి రివ్యూ చేయ‌టం.. ఈ కేసుకు సంబంధించిన వారు ఎవ‌రైనా స‌రే.. చ‌ర్య‌ల విష‌యంలో రాజీ ప‌డొద్దంటూ చేసినట్లుగా వెల్ల‌డించిన ప్రెస్ నోట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లాన్ని రేపింది.

ఇదిలా ఉంటే.. ఇదే కేసుకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. ఫైర్ బ్రాండ్‌ రోజా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌టం ఖాయ‌మ‌న్న వ్యాఖ్య చేశారు. ఈ కేసు విచార‌ణ ఇప్ప‌టికైనా వేగవంతం చేస్తార‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేసిన ఆమె.. త‌న పార్టీకి చెందిన ప‌లువురు నేత‌ల్ని టీఆర్ఎస్‌.. కాంగ్రెస్ లోకి పంప‌టం వెనుక బాబు వ్యూహం ఉండి ఉంటుంద‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు.

రేపొద్దున ఏదైనా అవ‌స‌రం వ‌స్తే.. త‌న‌ను ఆదుకునేందుకు వీలుగా త‌న పార్టీ నేత‌ల్ని ఇత‌ర పార్టీల్లోకి బాబు పంపిన‌ట్లుగా ఆమె ఆరోపించారు. త‌న ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి బాబే పంపించి ఉంటార‌న్నారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా కాంగ్రెస్‌లోకి పంపి ఉంటార‌న్న రోజా.. ప‌లువురు టీడీపీ నేత‌ల్ని ఇదే వ్యూహంతో టీఆర్ ఎస్ లోకి పంపి ఉండొచ్చ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకోవ‌టం బాబుకు అల‌వాటేన‌ని.. వైఎస్సార్ కాంగ్రెస్ కు మాత్రం పొత్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పారు. బాబు పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసిన రోజా.. ఓటుకు నోటు కేసు నుంచి బ‌య‌ట‌పడేందుకు బాబు చాలానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్నారు. ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే అమ‌రావ‌తికి వ‌చ్చిన కేసీఆర్ కు భారీ విందును ఇచ్చి ఉంటార‌ని ఆరోపించారు.