Begin typing your search above and press return to search.

జ‌గన్ అప్‌ డేటెడ్!... బాబు ఔట్ డేటెడ్‌!

By:  Tupaki Desk   |   29 Jan 2019 7:26 PM IST
జ‌గన్ అప్‌ డేటెడ్!... బాబు ఔట్ డేటెడ్‌!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై సెటైర్లు సంధించ‌డంలో వైసీపీ కీల‌క నేత‌ - ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా ముందు వ‌రుస‌లో ఉంటారనే చెప్పాలి. అస‌లు రోజా మీడియా ముందుకు వ‌చ్చారంటే.. బాబుపై ఏ త‌ర‌హా సెటైర్ ప‌డుతుందోన‌న్న ఆతృత అటు ప్ర‌జ‌ల‌తో పాటు ఇటు మీడియాలోనూ అమితాసక్తి క‌న‌బడుతున్న విష‌యం తెలిసిందే. ఇక రోజా మీడియా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే అప్ర‌మ‌త్త‌మయ్యే టీడీపీ నేత‌లు... రోజా ఏం మాట్లాడుతారా? దానిని ఎలా తిప్పికొట్టాలా? అన్న‌ట్లుగా కాసుక్కూర్చుంటున్న వైనం కూడా తెలియ‌నిదేమీ కాదు. ఈ నేప‌థ్యంలోనే నేడు తూర్పు గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా రోజా త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబుపై సెటైర్లు సంధించారు. బాబును ఔట్ డేటెడ్ వెర్ష‌న్‌ గా అబివ‌ర్ణించిన రోజా... అప్ డేటెడ్ వెర్ష‌న్ అయిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చంద్ర‌బాబు కాపీ కొట్టేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

అంత‌టితో ఆగ‌ని రోజా.. కాపీ కొట్టే స్టూడెంట్ ను ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించి...డీబారే క‌దా చేసేది అంటూ స‌మాధానం కూడా చెప్పేసి.. మ‌రి జ‌గ‌న్‌ ను కాపీ కొడుతున్న చంద్ర‌బాబును కూడా డీబార్ చేయాల్సిందే క‌దా అని ఓ స‌రికొత్త వాద‌న‌ను వినిపించారు. మ‌రో మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ 14 నెల‌ల పాటు సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టారు. యాత్ర‌లో భాగంగా దాదాపుగా అన్ని జిల్లాల్లోని మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టేసిన జ‌గ‌న్‌... కుల‌ వృత్తిదారులు - రైతులు - మ‌హిళ‌లు - వృద్ధులు - బ‌డుగు - బ‌లహీన వ‌ర్గాలు... ఇలా దాదాపుగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లిశారు. వారి స‌మ‌స్య‌లను తెలుసుకున్నారు. ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఏం చేయాల‌న్న దిశ‌గా ఆలోచ‌న చేసిన జ‌గ‌న్ అక్క‌డిక‌క్క‌డే తాను అదికారంలోకి వ‌స్తే... స‌ద‌రు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఏం చేస్తాన‌న్న విష‌యాన్ని కూడా ఆయ‌న చెప్పేశారు.

ఈ క్ర‌మంలోనే పింఛ‌న్ సొమ్మును రూ.2 వేల‌కు పెంపు, రైతుల‌కు ఉచితంగా పెట్టుబ‌డి సాయం - క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌.. ఇలా చాలా హామీల‌నే జ‌గ‌న్ ఇచ్చారు. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డేదాకా వేచి చూసిన చంద్ర‌బాబు... ఎన్నిక‌ల్లో మ‌రోమారు అధికారం చేప‌ట్టాల‌న్న కాంక్ష‌తో జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను దాదాపుగా మ‌క్కికి మ‌క్కీ కాపీ కొట్టేశారు. దీంతో త‌మ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టేసిన చంద్ర‌బాబు...కాపీ మాస్ట‌రేన‌ని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోప‌ణ‌ల డోస్‌ను మ‌రింత‌గా పెంచేసిన రోజా... ఏకంగా చంద్రబాబును ఔట్ డేటెడ్ వెర్ష‌న్‌ గా అభివ‌ర్ణించేశారు. అంతేకాకుండా త‌న పార్టీ అధినేత జ‌గ‌న్‌ ను అప్ డేటెడ్ వెర్ష‌న్‌గా చెప్పిన రోజా... జ‌గ‌న్ ప‌థ‌కాల‌ను కాపీ కొడుతున్న చంద్ర‌బాబును డీబార్ చేయాల‌ని పిలుపునిచ్చారు. మొత్తంగా రోజా వేసిన ఈ సెటైర్ బాగానే పేలింద‌ని చెప్పాలి.