Begin typing your search above and press return to search.

బాబుపై బుల్లెట్ ట్రైన్ ఎట‌కారం అదిరిందిగా!

By:  Tupaki Desk   |   8 July 2018 4:10 PM IST
బాబుపై బుల్లెట్ ట్రైన్ ఎట‌కారం అదిరిందిగా!
X
ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.తాజాగా మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా బాబు తీరును ఓ రేంజ్ లో ఎట‌కారం చేసుకున్నారు. నాలుగేళ్ల కాలంలో బాబు చెప్పిన మాట‌ల్నే ప్ర‌స్తావించిన ఆమె..బాబుపై వ్యంగ్య‌స్త్రాల్ని సంధించారు.బుల్లెట్ ట్రైన్ అంటూ హ‌డావుడి చేసిన బాబు ఇప్పుడ‌ది ఎక్క‌డ ఉంద‌ని ప్ర‌శ్నించారు.

ఇంట్లో దేవాన్ష్ ఆడుకుంటున్నాడా? బాబు అని ప్ర‌శ్నించారు. యాపిల్ కంపెనీ విజ‌య‌వాడ కాళేశ్వ‌ర‌రావు మార్కెట్లో ఉందా? అంటూ ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు అయినా అమ‌రావ‌తిలో నాలుగు అడుగుల పిట్టగోడ కూడా క‌ట్ట‌లేద‌న్నారు. ప్ర‌ధాని మోడీ.. బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో జ‌త క‌ట్టిన దుష్టుడు చంద్ర‌బాబు అంటూ విరుచుకుప‌డ్డారు. నాలుగేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా.. విభ‌జ‌న హామీల‌పై గాడిద‌లు కాశారా? అంటూ విరుచుకుప‌డిన ఆమె.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తామ‌న్న మాట‌పై మండిప‌డ్డారు. విభ‌జ‌న హామీల‌పై సుప్రీంను ఆశ్ర‌యిస్తామంటూ టీడీపీ నేత‌లు చెబుతున్న మాట‌ల్ని ఆమె త‌ప్పు ప‌ట్టారు.

నాలుగేళ్ల పాటు విభ‌జ‌న హామీల‌పై ఏం చేశార‌ని కోర్టు అడిగితే త‌ల‌లు ఎక్క‌డ పెట్టుకుంటారంటూ రోజా ప్ర‌శ్నించారు. బాబును ఒక రేంజ్లో విరుచుకుప‌డిన రోజా.. ఏపీ ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల‌నూ వ‌ద‌ల్లేదు. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఒక దద్ద‌మ్మ‌గా అభివ‌ర్ణించిన ఆమె.. ఆయ‌న‌కు వ‌య‌సు మీద ప‌డ‌టంలో బుర్ర ప‌ని చేయ‌టం లేద‌న్నారు. ఏపీ విభ‌జ‌న‌కు మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి కార‌ణంగా చెప్పిన రోజా.. గ‌త్యంతరం లేక‌నే మ‌ళ్లీ ఆయ‌న కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తున్నార‌న్నారు.

దివంగ‌త మ‌హానేత వైఎస్‌ ను జ‌యంతి నేప‌థ్యంలో న‌గ‌రిలోని పార్టీ కార్యాల‌యంలో మ‌హానేత గురించి మాట్లాడిన రోజా.. రాష్ట్రంలో ప్ర‌తి గుండె వైఎస్ ను గుర్తు తెచ్చుకుంటోంద‌న్నారు. వైఎస్సార్ అన్న‌ది పేరు కాద‌ని.. న‌మ్మ‌కానికి.. విశ్వ‌స‌నీయ‌త‌కు బ్రాండ్ అన్నారు. వైఎస్ ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల్ని దేశంలోని మ‌రే సీఎం చేయ‌లేద‌న్న ఆయ‌న‌.. గ‌డిచిన తొమ్మిదేళ్ల‌లో ఆయ‌న లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింద‌న్నారు.