Begin typing your search above and press return to search.

మంత్రి అవుతారా? అంటే రోజా ఏమందంటే?

By:  Tupaki Desk   |   29 May 2019 8:43 AM GMT
మంత్రి అవుతారా? అంటే రోజా ఏమందంటే?
X
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అఖండ విజయం సాధించడం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో రోజాకు మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా రోజా స్పందించారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఆయన వెన్నంటి ఉండి దర్శనం చేసుకున్నారు రోజా. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవిపై స్పందించారు.

జగన్ ఏ బాధ్యత అప్పగించినా తాను సమర్థవంతంగా నిర్వహిస్తానని రోజా స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం.. ప్రజల కోసం జగన్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. తాను ఎమ్మెల్యే కావాలన్నదే మొదటి లక్ష్యంగా ఉండేదని.. కానీ వైసీపీ అధినేత కాబోయే సీఎం జగన్ వల్ల తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని వివరించారు. తనకు రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. జగన్ కోసం ఎంత దూరమైన వెళ్తానని.. జీవితాంతం పోరాడుతూనే ఉంటానని.. మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా జగన్ అడుగులో అడుగేసి నడుస్తానని రోజా తెలిపారు.

ఇక చంద్రబాబునాయుడిపై కూడా రోజా నిప్పులు కురిపించారు. బాబు చేసిన దుబారా ఖర్చుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక నష్టాలతో దివాళా తీసిందన్నారు. బాబు చేసింది గోరంత అయితే.. కొండంత చేసినట్లు ప్రచారం చేసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని రోజా ఆరోపించారు.

ఇక తనను ఐరన్ లెగ్ అన్నవారికి ఈ విజయం చెంపపెట్టు అని రోజా ఉదహరించారు. 1999 ఎన్నికల్లో తాను చంద్రబాబుతో పాటు ప్రచారం చేశానని.. అప్పుడు బాబు అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఐరన్ లెగ్ ముద్రవేసి తనను జగన్ నుంచి దూరం చేయాలని చంద్రబాబు అండ్ కో ప్రయత్నించారని ఆరోపించారు. వైఎస్ జగన్ తనను సొంత చెల్లెలుగా భావించి తనకు అండగా నిలిచారని అన్నారు. నగరిలో నన్ను ఓడించడానికి చంద్రబాబు చాలా కుట్రలు చేశాడని.. కానీ జగన్ సహకారం, ప్రజల ఆశీర్వాదంతో వాటన్నింటిని త్యజించానని చెప్పుకొచ్చారు.