Begin typing your search above and press return to search.

జగన్ టార్చ్ బేరర్..బాబుది టార్చర్

By:  Tupaki Desk   |   17 Jun 2019 8:27 PM IST
జగన్ టార్చ్ బేరర్..బాబుది టార్చర్
X
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత - చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మైకందుకున్నారంటే... నిజంగానే ఆసక్తికర కామెంట్లే వస్తాయి. అలాంటిది ఆమె కోరుకున్నట్లుగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మరింత ఆసక్తికరమైన వ్యాఖ్యలు వస్తాయి కదా. అదే జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా సోమవారం మైకందుకున్న రోజా చాలా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. జగన్ తో చంద్రబాబును పోల్చి ఆమె చేసిన కామెంట్స్ నిజంగానే అదుర్స్ అని చెప్పాలి. జగన్ ను టార్చ్ బేరర్ గా అభివర్ణించిన రోజా... చంద్రబాబును మాత్రం టార్చర్ పెట్టిన నేతగా చెప్పారు. గడచిన ఐదేళ్లలో చంద్రబాబు పాలన అంతా టార్చర్ గానే సాగిందని ఆమె ఆరోపించారు. అసలు టార్చర్ అంటే ఏమిటో చంద్రబాబు జనాలకు చూపించారని ఆమె తనదైన శైలి సెటైర్లు వేశారు.

రాష్ట్రంలో మహిళలపై లెక్కలేనన్ని అఘాయిత్యాలు జరిగినా... చంద్రబాబు స్పందించిన పాపాన పోలేదని కూడా రోజా విరుచుకుపడ్డారు. వీధి వీధినా బెల్టు షాపులు పెట్టి మహిళల మాన ప్రాణాలతో ఆడుకున్నా అప్పటి టీడీపీ ప్రభుత్వానికి బాధ అనిపించలేదా? అని రోజా ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మహిళలకు బ్యాంకుల్లో రుణాలు పుట్టని పరిస్థితికి చంద్రబాబే కారణమన్నారు. నారాయణ కాలేజీల్లో ఆడపిల్లలు చనిపోతుంటే... వారి తల్లిదండ్రులు ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా బాద అనిపించలేదా? అని ఆక్రోశం వెళ్లగక్కారు. వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పి... రూ.2350 కోట్లకు ఎగనామం పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? అని కూడా విరుచుకుపడ్డారు. రైతుల రుణమాఫీని కూడా అమలు చేయలేని చంద్రబాబు తన పాలనను టార్చర్ పాలనగా మార్చేసుకున్నారని దుయ్యబట్టారు.

జనాన్ని ముందుండి నడిపించే నాయకుడిని టార్చ్ బేరర్ అంటారని పేర్కొన్న రోజా... ఐదు కోట్ల ఆంధ్రులను ముందుండి నడిపిస్తున్న జగన్ ముమ్మాటికీ టార్చ్ బేరరేనని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలంటే తొలుత మద్యపానాన్ని నిషేధించాలన్న కోణంలో ఆలోచించిన జగన్... ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని చెప్పారు. జగన్ ప్రకటించిన అమ్మ ఒడి పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కూడా రోజా చెప్పారు. మహిళలకు అండగా నిలిచేందుకు జగన్ ఎన్నో పథకాలకు ప్రవేశపెట్టబోతున్నారని, ఈ క్రమంలోనే ఆయన టార్చ్ బేరర్ గా నిలిచిపోతారని రోజా చెప్పారు. సరికొత్త సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన జగన్... రానున్న 30 ఏళ్ల పాటు కూడా ఏపీకి టార్చ్ బేరర్ గానే ఉంటారని కూడా రోజా జోస్యం చెప్పారు.