Begin typing your search above and press return to search.

చిరు గురించి రోజా అలా చెప్పేసింది

By:  Tupaki Desk   |   7 Jan 2017 1:56 PM GMT
చిరు గురించి రోజా అలా చెప్పేసింది
X
ఫైర్ బ్రాండ్ రోజా నోరు విప్పితే.. ఆమె రాజకీయ ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే. ముద్దు పేరుకు ఏ మాత్రం తేడా లేకుండా రఫ్ఫాడించే రోజా నోటి నుంచి సాత్వికంగా మాటలు వస్తేగిస్తే.. జబర్ధస్త్ షోలో వస్తాయి.. లేదంటే తమ అధినేత జగన్ గురించి మాట్లాడేటప్పుడు వస్తాయే తప్పించి.. విడిగా మాత్రం ఎంత మాత్రం రావు. ఆశ్చర్యకరంగా తాజాగా రోజా తన తీరుకు భిన్నమైన మాటల్ని చెప్పుకొచ్చారు.

తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఖైదీ నంబరు150తో మెగాస్టార్ చిరంజీవి వెండితెరకు రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ హాయ్ ల్యాండ్ లో సాగుతోంది. ఇదిలా ఉంటే.. బాస్ సినిమా విడుదల నేపథ్యంలో రోజా.. చిరు గురించి సినిమా ముచ్చట్లు చెప్పుకొచ్చారు. తాను హీరోయిన్ గా పని చేసే నాటి రోజుల్ని గుర్తు చేసుకున్న ఆమె.. చిరు గురించిన ఆసక్తికర అంశాల్ని చెప్పారు.

చిరంజీవి అన్న పేరు వినగానే ఆయన చేసే డ్యాన్సులు.. ఫైట్లు గుర్తుకు వస్తాయని.. ఆయనతో తాను ముఠామేస్త్రీ.. ముగ్గురు మొనగాళ్లు.. బిగ్ బాస్ సినిమాల్లో నటించిన విషయాన్ని గుర్తుకొచ్చారు. చిరంజీవితో కలిసి పని చేసేటప్పుడు.. డ్యాన్స్ చేసేటప్పుడు చాలా కాంపిటీషన్ గా ఉండేదని.. ఆయనతో తాను చేసిన పాటలు చాలా హిట్ అయ్యాయన్నారు.

రాజకీయాల గురించి వస్తే చిరు గురించి తీవ్రస్థాయిలో విరుచుకుపడే రోజా.. అందుకు భిన్నంగా చిరు తాజా ఖైదీ సినిమా విజయవంతం కావాలని.. చిరు తొలినాళ్లలో ఖైదీ సినిమా ఎంతటి పేరు తెచ్చిందో.. అంతటి పేరును తాజా ఖైదీ తీసుకురావాలని తాను ఆశిస్తున్నట్లుగా ఆమె చెప్పరు. చిరంజీవి నటించిన చిత్రాల్లో అపద్బాందవుడు తనకెంతో నచ్చిన సినిమా చెప్పారు. మొత్తానికి రోజా నోట ఒక్క విమర్శ.. ఎత్తిపొడుపు లేకుండా కేవలం సినిమా ముచ్చట్లు చెప్పటం ఈ మధ్యన ఇదేనేమో.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/