Begin typing your search above and press return to search.

రోజా - కేరాఫ్ మహిళా శక్తి

By:  Tupaki Desk   |   8 March 2018 4:30 AM GMT
రోజా - కేరాఫ్ మహిళా శక్తి
X

సాధారణంగా సినిమా తారలు రాజకీయాల్లో రాణించడం చాలా అరుదు. ఒకవేళ అభిమానుల మద్దతుతో గెలిచి ఎమెల్యే గానో లేక ఎంపిగానో ఎంపికైనా సేవ చేసిన వాళ్ళను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. అందులోనూ హీరొయిన్లకు ఇది ఇంకా కష్టమైన పని. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే సినిమా ప్రపంచంలో నిలదొక్కుకోవడం ఒక ఎత్తైతే వచ్చిన పేరుని సక్రమంగా నిలబెట్టుకుని తమను ఇంత వాళ్ళను చేసిన ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజకీయాల్లో రాణించినవారు చాలా తక్కువ. అలా రెండు పడవల మీద ప్రయాణాన్ని సమర్ధవంతంగా నడిపిన అతి కొద్ది మందిలో రోజా ఒకరు. మహిళా దినోత్సవం సందర్భంగా ఫైర్ బ్రాండ్ మీద స్పెషల్ ఆర్టికల్

సినిమా కెరీర్ తొలినాళ్ళలో ఎలాంటి అవకాశాలు వస్తాయో వాటిని బట్టే భవిష్యత్తు ఉంటుందని అన్నది పరిశ్రమలో అందరికి తెలిసిన సత్యమే. కాని తనకు సవాల్ గా నిలిచే ఏ పాత్రను రోజా వదిలిపెట్టలేదు. అందుకు నిదర్శనమే శోభన్ బాబు గారి కూతురిగా తను తెరంగేట్రం చేసిన సర్పయాగం సినిమా. అంతటి సీనియర్ నటుడి ముందు ఎటువంటి బెరుకు లేకుండా అమాయకత్వం కలబోసిన దగాపడిన డాక్టర్ కూతురిగా రోజా నటన ఆయనను సైతం మెప్పించడం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అప్పుడు అంది వచ్చిన నమ్మకమే ప్రేమ తపస్సు సినిమాలో డీ గ్లామర్ రోల్ వచ్చినా ఒప్పుకునేలా చేసింది. ఇవన్ని గ్లామర్ తో వరస బెట్టి అవకాశాలు వచ్చేలా చేసిన పాత్రలు కావు. మరో హీరొయిన్ అయితే బెంగపడి వెళ్ళిపోయేదేమో. అలా చేయలేదు కనకే సరైన సమయంలో సెల్వమణి చామంతి సినిమా తనకో కొత్త దిశానిర్దేశనం చేసింది. ఆ సినిమా దర్శకుడే తన జీవిత భాగస్వామి అవుతాడని విధి ముందు గానే రాసి పెట్టింది కాబోలు కోరిమరీ వచ్చిన చామంతి సినిమా తన దారినే మార్చింది. ఆ తర్వాత శరత్ కుమార్ సూరియన్ కూడా బ్లాక్ బస్టర్ కావడం మలుపు తిప్పింది.

ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సీతారత్నం గారి అబ్బాయి ఘన విజయం రోజాలోని నటిని మరోసారి టాలీవుడ్ కు పరిచయం చేసింది. వినోద్ కుమార్ కాంబోలో పలు విజయవంతమైన సినిమాలు చేసాక తక్కువ టైం లోనే చిరంజీవితో ముఠామేస్త్రి లో అవకాశం రావడం, బాలకృష్ణ బొబ్బిలి సింహంలో త్యాగభరితమైన పాత్రలో రోజా విశ్వరూపానికి ప్రేక్షకులు నీరాజనాలు పలకడం ఒకటి కాదు ప్రతిది విజయానికి మెట్టుగా నిలిచింది. రాజశేఖర్ సరసన అన్నలో చలాకి చండిగా అలరిస్తే శుభలగ్నం సినిమాలో కోరుకున్నవాడి కోసం కోట్లను తృణప్రాయంగా త్యజించే లతా పాత్రలో రోజా బదులు ఇంకెవరిని ఊహించుకోలేం.అంత గొప్పగా పండించారు. కాబోయే భర్తతో సమరం సినిమాని భారీ ఎత్తున మల్టీ లాంగ్వేజ్ లో నిర్మించడం ఆర్థికంగా దెబ్బ వేసిన వెంటనే కోలుకుని సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. వెంకటేష్ పోకిరి రాజా, నాగార్జున వజ్రం ఇలా లిస్టు పెరుగుతూనే పోయింది. తన కోసం అగ్ర హీరోలు వెయిట్ చేస్తున్న టైం లో కమెడియన్ హీరోగా మారిన ఆలి పక్కన జోడిగా నటించడం చూసి చెవులు కొరుక్కోని హీరొయిన్ లేదు. ఆ సాహసం తనకు మాత్రమే సాధ్యమైంది.

రోజా గ్లామర్ పాత్రలకే ఎన్నడు కట్టుబడలేదు. అడవిలో అన్న సినిమాలో మోహన్ బాబు తో పోటీగా విప్లవ నారిగా నటించినా స్వర్ణక్క సినిమాలో నక్సలైట్ గా పాత్రకు జీవదానం చేసినా, సమ్మక్క సారక్కలో గ్రామదేవతగా మెప్పించినా అది తనకు మాత్రమే చెల్లింది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ఫ్యామిలీ సర్కస్ లాంటి హాస్య భరిత చిత్రాల్లోనూ రోజా తన బ్రాండ్ నిలబెట్టుకున్నారు. సమరం సినిమాతో దెబ్బ తిన్న కసిని దుర్గ ఘన విజయం ద్వారా సెలెబ్రేట్ చేసుకున్నారు రోజా, సెల్వమణి. ఫాంటసీ కథాంశంతో రూపొందిన ఆ మూవీ భారీ పోటీని తట్టుకుని మరీ సక్సెస్ సాదించింది. తమిళ్ లో రోజాకు ఎన్నో మరపురాని విజయాలు ఉన్నాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో గోలీమార్ సినిమా ద్వారా తనలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనలో మరో కోణాన్ని పరిచయం చేసిన తరువాత మళ్ళి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అది జబర్దస్త్ షోకు జడ్జ్ గా వచ్చే దాక కొనసాగుతూనే ఉంది.

ఇది నాణేనికి ఒక వైపు. రెండో వైపు రాజకీయం. గ్లామర్ ప్రపంచం నుంచి వచ్చిన హీరొయిన్లు రాజకీయాల్లో రాణించరు అని భ్రమను పటాపంచలు చేస్తూ డైనమెట్ లా దూసుకువచ్చిన జనం గుండెలలో శాశ్వతంగా అమరుడై నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడవలానే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన బాటలో నడవడానికి సిద్ధపడ్డారు. తన నిజాయితిని గుర్తించిన నగరి ప్రజలు ఎమెల్యేగా పట్టం కట్టారు. అధికారం లో ఉన్నది టిడిపినే అయినా సమస్యలపై గళమెత్తడానికి ఏనాడు వెనుకాడని రోజా టిడిపి మంత్రుల ముప్పేట దాడిని, అవమానాలు ధీటుగా ఎదురుకుని నారి శక్తిని నిరూపించారు. తన పేరు వింటేనే భయం పుట్టేలా అధికార పార్టీ నేతలకు కునుకు పట్టకుండా చేసిన రోజాకు బలం ప్రజలే. అందుకే నగరి అభివృద్ధికి ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఉన్నది ప్రతిపక్షంలోనే అయినా మడమ తిప్పకుండా ముందుకు వెళ్తూ ముందు ప్రజలు తర్వాతే మనం అనే సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రోజా ఎందరో మహిళలకు ఆదర్శనీయం. ఆత్మనూన్యతతో బాధ పడే వారికి తన జీవితాన్నే ఒక స్ఫూర్తి పుస్తకంగా మార్చిన రోజాకు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం.