Begin typing your search above and press return to search.

రోజా ఫ్యూచర్ బుద్ధప్రసాద్ చేతిలో

By:  Tupaki Desk   |   2 Jan 2016 2:57 PM IST
రోజా ఫ్యూచర్ బుద్ధప్రసాద్ చేతిలో
X
ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, టీడీపీ మహిళా ఎమ్మెల్యేను బూతులు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారం ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ కోర్టులోకొచ్చింది. ఆమె వ్యవహార శైలి శ్రుతిమించడంతో ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే... రోజాపై సస్పెన్షన్ ఎత్తేయాలని వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తుండడంతో ప్రజాస్వామ్య విలువలను పాటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రోజా వ్యవహారంపై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేందుకు గాను ప్రత్యేక కమిటీ వేసింది. అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని వేసింది. ఈ కమిటీలో అధ్యక్షుడిగా బుద్ధప్రసాద్ - సభ్యులుగా ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్(టీడీపీ)- గడికోట శ్రీకాంత్ రెడ్డి(వైసీపీ) - విష్ణుకుమార్ రాజు(బీజేపీ) ఉంటారు.

కమిటీ ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ప్రకారం స్పీకర్ తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందో లేదో తేల్చుకుంటారు. దాని ఆధారంగా ఆయన రోజాపై సస్పెన్షన్ కొనసాగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తారని సమాచారం. అవసరమైతే మరికొంత కాలం పొడిగించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

అయితే... ఇప్పటికే స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ తో వేసిన కమిటీ ఇచ్చే నివేదిక కూడా ఆ నిర్ణయానికి అనుకూలంగానే ఉండొచ్చని భావిస్తున్నారు. కాబట్టి రోజా సస్పెన్షన్ ఎత్తివేయకపోవచ్చంటున్నారు. పైగా కమిటీలో సభ్యులు కూడా ఒకరు టీడీపీ, ఇంకొకరు బీజేపీ సభ్యులున్నారు. బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఈ ఘటన సమయంలో రోజా సస్పెన్షన్ ను ఎత్తేయాలని తొలుత కోరినా ఆ తరువాత ఆమె మాటలకు సంబంధించిన వీడియోలు వచ్చిన తరువాత ఆయన తన వైఖరి మార్చుకున్నారు. దారుణంగా మాట్లాడిందని.. ఆ సంగతి తెలియక మానవాతా దృక్పథంలో సస్పెన్షన్ ఎత్తేయాలని కోరానని... ఇప్పుడు ఆమె మాటలు చూశాక తన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ లెక్కన టీడీపీ, బీజేపీ ఇద్దరు సభ్యుల మద్దతు సస్పెన్షన్ వైపే ఉండడంతో రోజాకు అనుకూలంగా నిర్ణయం వస్తుందన్న ఆశలు లేవు. మరోవైపు గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా టీడీపీకి చేరువవుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన స్పందన ఎలా ఉంటుందన్నదీ అనుమానమే. దీంతో రోజా సస్పెన్షన్ విషయంలో పెద్దగా మార్పు ఉండదని భావిస్తున్నారు.