Begin typing your search above and press return to search.

మళ్లీ అలాగే చేశారు .. సొంత పార్టీ నేతలపై రోజా ఫైర్ !

By:  Tupaki Desk   |   10 March 2021 11:43 AM GMT
మళ్లీ అలాగే చేశారు .. సొంత పార్టీ నేతలపై రోజా ఫైర్ !
X
వైసీపీ మహిళా నేత , ఫైర్ బ్రాండ్ నేత , నగరి ఎమ్మెల్యే రోజా మున్సిపల్ ఎన్నికల రోజే సొంత పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మరోసారి ఫైర్ అయ్యారు. స్వపక్షంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, కొందరు నేతలు తనను ఇబ్బంది పెడుతున్నారని రోజా గత కొన్ని రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే మున్సిపల్ ఎన్నికల రోజే ఆ విబేధాలు తారాస్థాయికి చేరాయి. అదే విషయాన్ని స్వయంగా పోలింగ్ రోజే రోజా బహిర్గతంగా మాట్లాడడం అధిష్టానాన్ని షాక్ కు గురి చేసింది.

వివరాల్లోకి వెళ్తే .. వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన నగరి ఎమ్మెల్యే రోజా పరిధిలోని రెండు మునిసిపాలిటీలో ఏకగ్రీవాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. నగరి మున్సిపాలిటీలో 29 వార్డులకు 7 మాత్రమే రోజా ఏకగ్రీవం చేసుకోగలిగారు. మిగిలిన అన్ని వార్డులలో ఎన్నికలు జరుగుతున్నాయి. అదే నియోజకవర్గంలోని మరో మున్సిపాలిటీ అయినా పుత్తూరులోని 27 వార్డులలో 1 మాత్రమే ఏకగ్రీవం కాగా మరో 26 వార్డులకు ఎన్నికలు జారుతున్నాయి. నగరిలో ఓటు హక్కు వినియోగించుకున్న రోజా సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారే మరోసారి ఇప్పుడు ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నగరి, పుత్తూరు నియోజకవర్గాల్లో 14 మంది రెబల్స్ ను బరిలోకి దింపి, ప్రతిపక్ష పార్టీ గెలుపునకు సహకరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రెబెల్స్ ను భారీగా గెలిపించేందుకు భారీగా డబ్బులు కూడా ఖర్చు చేశారని ఆరోపించారు. పార్టీలో ఉన్న కొందరు పెద్దలు, రెబెల్ నాయకులకు సపోర్ట్ చేస్తూ వారేదో దేశ సేవకులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తల్లి పాలు తాగి రొమ్మును తన్నే విధంగా కొందరు నాయకులు ప్రవర్తించడం దారుణమన్నారు. వైసీపీలోనే ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడం ఇష్టం లేనివారే ఇదంతా చేస్తున్నారని.. ఇప్పటికే దీనిపై అధిష్టానానికి చాలాసార్లు ఫిర్యాదు చేశాను అన్నారు. ఇప్పటికైనా అదిష్టానం చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం తప్పదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.