Begin typing your search above and press return to search.

వెంకయ్య ఇంటిపై రైడ్ చేయాలట..

By:  Tupaki Desk   |   4 Dec 2016 11:16 AM IST
వెంకయ్య ఇంటిపై రైడ్ చేయాలట..
X
ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన నల్లధన నియంత్రణ చర్యలకు వంతపాడుతున్న కేంద్ర మంత్రి, ఏపీ బీజేపీ నేత వెంకయ్యనాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. పెద్దోళ్లంతా బాగానే ఉన్నారని... పేదలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని ఆమె విమర్శించారు. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మోదీ కోల్పోయారని అన్నారు. అంబానీ - అదానీ - వెంకయ్యనాయుడుల ఇళ్లపై ఐటీ దాడులు చేయిస్తే మోడీ చిత్తశుద్ధిని అప్పుడు నమ్ముతామన్నారు.

కేంద్రంలో మోదీ, ఏపీలో చంద్రబాబు కలిసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని రోజా విమర్శించారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ రావు - గాలి జనార్దన్‌ రెడ్డిలు ఒక్కొక్కరు వంద కోట్లు పెట్టి వివాహాలు చేశారని.. బండారు దత్తాత్రేయ కూడా కోట్లాది రూపాయలు వెదజల్లి కూతురి పెళ్లి చేశారని.. నోట్ల రద్దుతో జనానికి 2 వేలు కూడా దొరకని సమయంలో వారికి అంత ఆడంబరంగా వివాహాలు చేయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.

బ్లాక్‌ మనీ అరికట్టడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అధికార పార్టీ నేతలు బాగానే ఉన్నారని పేదలే ఇప్పుడు ఇబ్బందిపడుతున్నారని విమర్శించారు. పేదలను రోడ్డు మీదకు తెచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

నోట్ల రద్దు నేపథ్యంలో మోడీ సర్కారు మీదా.. ప్రధాని మోడీ మీదా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లిని సైతం క్యూలైన్లో నిలుచోబెట్టిన మోడీ.. అంబానీని మాత్రం ఎందుకు క్యూలో నిలుచోబెట్టలేదంటూ మండిపడ్డారు. రద్దు నిర్ణయంతో.. ప్రజలు పడుతున్న కష్టాల్ని ఏకరువు పెట్టిన ఆమె.. మోడీపై తీవ్ర విమర్శలు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/