Begin typing your search above and press return to search.

బాబుకు రోజా క్వశ్చన్..వీధి రౌడీలం మేమా? మీరా?

By:  Tupaki Desk   |   28 Feb 2020 4:15 PM GMT
బాబుకు రోజా క్వశ్చన్..వీధి రౌడీలం మేమా? మీరా?
X
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం నాటి విశాఖ టూర్ లో చోటుచేసుకున్న పరిణామాలు - ఉద్రిక్త పరిస్థితులపై అధికార పార్టీ వైసీపీ - విపక్షం టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బాబుకు అడ్డుకున్న వైసీపీ శ్రేణులను వీధి రౌడీలంటూ టీడీపీ నేతలు చేసిన కామెంట్ పై వైసీపీ ఫైర్ బ్రాండ్ - చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఓ రేంజిలో ఫైరయ్యారు. చంద్రబాబుకు సూటిగా ప్రశ్నలు సంధించిన రోజా... అసలు వీధి రౌడీలు టీడీపీ నేతలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీధి రౌడీలం మేమా? మీరా? అంటూ రోజా సంధించిన ప్రశ్నలతో ఇప్పుడు టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తన నియోజకవర్గం నగరిలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 27 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.32.7 లక్షల చెక్కులను రోజా శుక్రవారం బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ కామెంట్లను ప్రస్తావించిన రోజా..చంద్రబాబు వైఖరిపై నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా రోజా ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘మాట మాటకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన గవర్నమెంట్‌ లో ఎంత అవినీతి - ఎంత అరాచకం జరిగిందనేదానికి ఈ సంఘటన ఉదాహరణ. మీ సామాజిక వర్గంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తూ.. అధికారులను భయభ్రాంతులకు గురిచేయిస్తున్నవీధి రౌడీలు మీరా.. మేమా !. ఆరోజు నన్ను నిర్బంధించి కాన్వాయ్‌ లో ఎక్కడకు తీసుకు వెళ్లారో కూడా అంతు చిక్కకుండా చేసిన చంద్రబాబు... ఈ రోజు రాజ్యాంగం పట్ల నిబద్దత గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉంది. అప్పుడు అవలంభించని చట్టాలు నేడు గుర్తొచ్చాయా’’ అంటూ ఆమె చంద్రబాబుపై ఓ రేంజిలో ధ్వజమెత్తారు.

పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉందని రోజా వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటనను ప్రజలు అడ్డుకుంటే.. ఆ నిందను ప్రభుత్వంపై నెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన సంఘటనల వీడియోలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని - అందులో ఎక్కడైనా తమ పార్టీకి చెందిన కార్యకర్తలు ఉన్నట్లు చూపిస్తే రాజీనామా చేయడానికి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని రోజా సవాల్ విసిరారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించవద్దని హితవు పలికారు. బినామీల పేరు మీద కొన్న భూముల విలువ తగ్గిపోతుందని ప్రశాంతంగా ఉన్న అమరావతిని బాబు అగ్నిగుండంలా మార్చారని రోజా మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా లోక్‌ష్‌ కు జగన్‌ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న ఆయనకు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ రైతు పాస్‌ బుక్‌ కోసం లక్ష రూపాయలు ఇచ్చానని చెప్పడం సిగ్గు చేటు అని విమర్శించారు. ఒక ప్రాంతానికి అన్యాయం చేసి - అభివృద్ధిని అడ్డుకుని - వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన చంద్రబాబు మళ్లీ ఆ ప్రాంతానికి వెళితే ఎలా స్వాగతిస్తారనే కామన్‌ సెన్స్‌ ఉందా అని రోజా ప్రశ్నించారు.