Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి

By:  Tupaki Desk   |   9 Jun 2016 11:25 AM IST
చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి
X
ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 (చీటింగ్) కేసు నమోదు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. తన నియోజకవర్గం నగరిలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 700 రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు 600 హామీలిచ్చారని.. కానీ, అందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. చంద్రబాబులా ప్రజలను మోసగించిన సీఎం ఇంకెవరూ లేరని రోజా తనదైన శైలిలో మండిపడ్డారు.

కాగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు వైసీపీ నేతలంతా ఆందోళనలు చేశారు. చంద్రబాబుపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా పలుచోట్ల ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి విస్మరించారని.. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని, నిరుద్యోగ భృతి రూ.2వేలు ఇస్తానని చెప్పి విస్మరించి ప్రజలను మోసం చేశారని చంద్రబాబుపై ఆరోపణలు గుప్పిస్తూ వైసీపీ నేతలు హడావుడి చేశారు.

చంద్రబాబు ప్రజల సొమ్ముతో విదేశాలు తిరుగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఎడారిగా మారుస్తున్నారని పలువురు వైసీపీ నేతలు ఆరోపించారు. దోచుకున్న సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటూ వాపును చూసి బలుపనుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. బాబు నయవంచన పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని శాపనార్థాలు కూడా పెట్టారు.