Begin typing your search above and press return to search.

రోజా మాట: న‌న్ను చంప‌డ‌మే ల‌క్ష్యం

By:  Tupaki Desk   |   25 March 2016 9:04 AM GMT
రోజా మాట: న‌న్ను చంప‌డ‌మే ల‌క్ష్యం
X
ఏపీ అసెంబ్లీ నుంచి స‌స్పెన్ష‌న్‌ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు, టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతేకాకుండా ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు రెడీ అని స‌వాల్ కూడా విసిరారు. వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కారుపై దుమ్మెత్తిపోశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి ప్రశ్నించినందుకే తనను ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని రోజా ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్‌ పై చర్చకు తాను డిసెంబర్ 17న మొదటిసారిగా నోటీసు ఇస్తే...ఆరోజు నోటీసు చర్చకు రాకుండా కుట్ర చేశారని ఆరోపించారు. ఆ తర్వాత డిసెంబర్ 18న మళ్లీ నోటీసు ఇచ్చి చర్చకు పట్టుబడితే అంబేద్కర్ అంశాన్ని తెరపైకి తెచ్చి మమ్మల్ని సస్పెండ్ చేశారని వివరించారు. ఏపీలో ఏం జరుగుతుందో చూస్తే అంబేద్కర్ సహించరని తెలిపారు.

ఏపీ అసెంబ్లీలో తనను చంపేందుకు ప్ర‌యత్నించారని రోజా ఆరోపించారు. సస్పెండ్‌ అయిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేసినప్పుడు పోలీసులు మహిళ అని చూడకుండా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్షల్స్ తనపై కూర్చున్నారని, ఆ తర్వాత బలవంతంగా తనను లాక్కెళ్లి పోలీస్ స్టేషన్‌ లో పడేశారని తెలిపారు. తన అంతం లక్ష్యంగా వారు ప్ర‌యత్నించార‌ని మండిప‌డ్డారు. అధికార పార్టీలోని పురుష అహంకారానికి, ఓ మహిళకు జరుగుతున్న పోరాటం ఇది అని రోజా పేర్కొన్నారు. తనను అసెంబ్లీలోకి అనుమతించాలని హైకోర్టు చెప్పినప్ప‌టికీ బేఖాతరు చేయడంపై ఆమె మండిపడ్డారు. శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ వేలు పెట్టకూడదని వాదిస్తోన్న ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ తప్పు అని హైకోర్టు చెప్పినా డివిజన్ బెంచ్‌ కు ఎందుకు వెళ్లిందని నిలదీశారు. సస్పెండ్ చేసిన రోజు తన వాదన విని ఉంటే సస్పెన్షన్‌ లో అర్థం ఉండేదని వివరించారు.

తప్పును ప్రశ్నిస్తే టీడీపీ నాయ‌కులు గిలగిలలాడుతున్నారని అయితే త‌న‌ న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తన సస్పెన్షన్ విషయంలో ఎమ్మెల్యే అనితను పావుగా వాడుకున్నారని రోజా విమర్శించారు. సస్పెన్షన్ కోర్టులో నిలబడదనే ఉద్దేశంతోనే హడావిడిగా ప్రివిలెజెస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది నిజంకాదా? అని రోజా ప్రశ్నించారు. బోండా ఉమ తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నిస్తే ఇంత వరకు పట్టించుకోలేదని, టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదును మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. తాము మహిళలం కాదా? అని రోజా నిల‌దీశారు. తాను మాట్లాడిన మాటల్లో తప్పు ఉన్నట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆమె స్పష్టం చేశారు.