Begin typing your search above and press return to search.
రోజా ప్రశ్నలకు ఆన్సర్లున్నాయా?
By: Tupaki Desk | 3 March 2017 12:12 PM ISTకృష్ణా జిల్లా నందిగామ సమీపంలో మొన్న జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి నిన్న జరిగిన కేబినెట్ భేటీలో చంద్రబాబు సర్కారు తీవ్రంగా సమీక్షించింది. క్షతగాత్రుల పరామర్శ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించారంటే ఏ మేర ఈ అంశంపై చర్చ జరిగిందో ఇట్టే అర్ధం కాక మానదు. క్షతగాత్రులకు పరామర్శ సందర్భంగా జగన్ అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారని తీర్మానించిన కేబినెట్... జగన్ వైఖరిని తప్పుబడుతూ మరో తీర్మానం కూడా చేసింది. ఈ వ్యవహారంపై నేటి ఉదయం విజయవాడలో మీడియా ముందుకు వచ్చిన వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రమాదం జరిగిన ప్రదేశానికి కూత వేటు దూరంలోనే ఉన్న సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కేబినెట్ సహచరులు ఉన్నా... ఏ ఒక్కరు కూడా ప్రమాద స్థలికి ఎందుకు వెళ్లలేదని రోజా ప్రశ్నించారు. క్షతగాత్రులను పరామర్శించాల్సిన బాధ్యత చంద్రబాబు సర్కారుకు లేదా? అని కూడా ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం రాని నేపథ్యంలోనే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ విపక్ష నేత హోదాలో బాధితులను పరామర్శిస్తే... అధికారులు అడుగడుగునా అడ్డుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఆ ప్రమాదానికి సంబంధించి ఇప్పటిదాకా ఎందుకు కేసు పెట్టలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారంపై కేబినెట్‌లో ఎందుకు తీర్మానం చేయలేదో చెప్పాలంటూ ఆమె నిలదీశారు.
పరామర్శ సందర్భంగా ప్రమాదానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న డ్రైవర్ మృతదేహానికి పోస్టు మార్టం చేయకుండానే తరలిస్తున్న వైనంపై జగన్ ప్రశ్నించారని, పోస్టుమార్టం చేశామని కలెక్టర్, చేయలేదని వైద్యుడు చెప్పడంతోనే జగన్ వారిద్దరినీ నిలదీశారని తెలిపారు. అసలు పోస్టుమార్టం కాపీలను తారుమారు చేసి ట్రావెల్స్ యాజమాన్యాన్ని రక్షించేందుకు జరుగుతున్న యత్నాలను అడ్డుకునే క్రమంలోనే జగన్ పోస్టుమార్టం కాపీలను అడిగారన్నారు. పోస్టుమార్టానికి సంబంధించి అప్పటికే రూపొందించిన మూడు కాపీల్లో ఒక కాపీని తనకు ఇవ్వాలని జగన్ అడిగినా... కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎందుకు హైరానా పడ్డారని రోజా ప్రశ్నించారు.
కలెక్టర్, వైద్యుల హైరానా చూస్తుంటేనే ఈ కేసును తారుమారు చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయని చెప్పక ఇంకేమనాలని ఆమె ప్రశ్నించారు. పేదవాడిని అన్యాయం జరుగుతున్న కారణంగానే జగన్ ఆగ్రహానికి గురయ్యారని, ఇదేం న్యాయమని ప్రశ్నించారని ఆమె చెప్పుకొచ్చారు. తనను టార్గెట్ చేస్తేనే పదవులు వస్తాయని టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత భావిస్తున్నారని, ఈ తరహా భావన తనను బాధకు గురి చేస్తోందని రోజా చెప్పారు. తాను కూడా గతంలో టీడీపీలో ఉన్నానని, తనకు ఎదురైన పరిస్థితుల కారణంగానే తాను టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో చేరానని రోజా చెప్పారు. నేడో, రేపో అనితకు కూడా అలాంటి పరిస్థితులే ఎదురుకాక తప్పదని కూడా ఆమె జోస్యం చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
