Begin typing your search above and press return to search.

బాబు మీ ఇంట్లో ముందుగా మ‌ద్ద‌తు తీసుకో

By:  Tupaki Desk   |   3 Nov 2016 9:33 PM IST
బాబు మీ ఇంట్లో ముందుగా మ‌ద్ద‌తు తీసుకో
X
వాలెంటైన్స్‌ డే సందర్భంగా విశాఖలో బీచ్‌ లవ్‌ వేడుకలు నిర్వహించడంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు తారాస్థాయికి చేరాయి. స్వర్గీయ ఎన్‌ టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అలాంటి పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మన సంస్కృతి - సాంప్రదాయాలను భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్‌ ఆర్‌ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు - ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. నిత్యం విదేశీ జపం చేసే చంద్రబాబు..ఇప్పుడు ఆ దేశాల సంస్కృతిని విశాఖపట్నం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ నగరంలో ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా ప్రతినిథుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఎన్‌ టీఆర్‌ కూతురుగా పుట్టిన భువనేశ్వరి - మనవరాళు బ్రహ్మీణి చంద్రబాబు నిర్ణయాన్ని ఖండిస్తారో? సమర్థిస్తారో తెల్చుకోవాలని సూచించారు. వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీగా బీచ్‌ వేడుకలను అడ్డుకుంటామని ఆర్కే రోజా హెచ్చరించారు.

టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య - విజయవాడలో కాల్‌ మనీ–సెక్స్‌ రాకెట్ - తహశీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి - తనను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేసిన విధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయంటే ఏపీలో అరాచకాలు ఏమాత్రం ఉన్నాయో అర్థమవుతుందన్నారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మహిళలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దగా చేశారని రోజా ధ్వజమెత్తారు. రూ.14600 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేసేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదని, ఆయన మాత్రం ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతూ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించారని, ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని వాగ్దానం చేసి తీరా సీఎం అయ్యాక చిల్లీ గవ్వ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పథకం కింద రూ.30 వేలు చెల్లిస్తామన్నారని, ఏ ఒక్కరికి ఈ పథకం వర్తించలేదని రోజా విమర్శించారు. గర్భిణులకు పండంటి బిడ్డ పుడితే, వారి పౌష్టికాహారం కోసం రూ.10 చెల్లిస్తామన్నారని, మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తామని చంద్రబాబు స్మార్ట్‌గా మోసం చేశారన్నారు. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో నారావారి నరకాసురుడి పాలనను అంతం చేద్దామని రోజా పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలన మూడు ముక్కల్లో చెప్పాలంటే అరిష్టం - అవినీతి - అరాచకాలని ఎమ్మెల్యే రోజా అభివర్ణించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వేళా విషయమే, ఏమో తెలియదు కానీ..ఈ రెండుళ్లుగా సకాలంలో వర్షాలు కురవక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరువుకు పాయింట్ - షర్ట్‌ వేస్తే అది చంద్రబాబే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచుకోవడం - దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, అవినీతిలో ఏపీని నంబర్‌ వన్‌ చేసిన ఘనత బాబుదేన‌ని రోజా ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/