Begin typing your search above and press return to search.

అప్పుడు మగాళ్లు లేకే జగన్ అలా చేశారా?

By:  Tupaki Desk   |   18 April 2016 10:11 AM IST
అప్పుడు మగాళ్లు లేకే జగన్ అలా చేశారా?
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా చెలరేగిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడలేదు. విశాఖలో పార్టీకి చెందిన అమర్ నాధ్ రైల్వే డివిజన్ కోసం చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాటల్ని తూటాల్లా పేల్చారు. టీడీపీలో మగాళ్లు లేకనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని తీసుకెళుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు ఏ మాత్రం దమ్మూ.. ధైర్యం ఉన్నా.. రాయలసీమ గడ్డ మీద పుట్టినవాడే అయితే టీడీపీలోకి చేర్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. ముఖ్యమంత్రి.. కేంద్రమంత్రుల చేతకానితనం కారణంగా విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని కేంద్రం అమలు చేయటం లేదని దుయ్యబట్టారు.

రోజా మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. లాజిక్ గా చూస్తేనే లెక్క తప్పిన విషయం ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే.. మగాళ్లు లేకనే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని ఏపీ ముఖ్యమంత్రి తీసుకెళుతున్నారని చెబుతున్న రోజా మాటలు నిజమైతే.. వైఎస్ జమానాలో ఇతర పార్టీల నుంచి నాటి వైఎస్ తీసుకెళ్లిన నేతల మాటేమిటి? అప్పుడు కాంగ్రెస్ లో మగాళ్లు లేకనే వైఎస్ ఆ పని చేశారా? అంతదాకా ఎందుకు తల్లి కాంగ్రెస్ నుంచి తాను పెట్టిన పిల్ల కాంగ్రెష్ లోకి జగన్ ఎందుకని తీసుకొచ్చినట్లు? అన్నవి ప్రశ్నలు అయితే.. మరి.. మగాళ్లు లాంటి ఎమ్మెల్యేలు జగన్ పార్టీని ఎందుకు విడిచిపెడుతున్నట్లు? లోపం ఎక్కడుందంటూ తెలుగు తమ్ముళ్లు సంధిస్తున్న ప్రశ్నలకు రోజా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.