Begin typing your search above and press return to search.

ఏపీలో వెన్నుపోటు బ్రదర్సు ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   29 Sept 2016 6:42 AM
ఏపీలో వెన్నుపోటు బ్రదర్సు ఎవరో తెలుసా?
X
టీడీపీ నేతలపై విరుచుకుపడడంలో స్పెషలిస్టయిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, పనిలో పనిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులను ఒకేసారి ఎండగట్టేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా వారే అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె ఆ ఇద్దరికీ కొత్త బిరుదు కూడా ప్రదానం చేశారు. చంద్రబాబు, వెంకయ్యలను ఆమె వెన్నుపోటు బ్రదర్సుగా అభివర్ణించారు.

ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా ఇద్దరు వెన్నుపోటు బ్రదర్స్‌ అడ్డుకున్నారని ఆరోపించిన రోజా... హోదా కోసం పోరాడుతున్న విద్యార్థులను కూడా ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని వెంకయ్య నాయుడు, 15 ఏళ్లు కావాలని చంద్రబాబు కోరిన సంగతిని ఈ సందర్భంగా రోజా గుర్తు చేశారు. అలాంటి వారు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాట్లాడుతున్నారన్నారు. అబద్దాలాడిన చంద్రబాబు - వెంకయ్యలను ఏం చేయాలని రోజా ప్రశ్నించారు. హామీల అమలు కోసం పోరాడడం మానేసి దోమలపై యుద్ధం చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం దత్తత గ్రామం అరకులో విషజ్వరాలతో జనం చనిపోతున్నారని.. దోమలపై యుద్ధానికి అర్థం ఎక్కడుందని మండిపడ్డారు.

అంతేకాదు... చంద్రబాబు తన సొంత జిల్లాలోనే ఏమీ చేయలేకపోతున్నారని.. ఇక రాష్ట్రానికి ఆయనేం చేస్తారని రోజా మండిపడ్డారు. సొంత జిల్లాలో మన్నవరం ప్రాజెక్టు ను కాపాడుకోలేని ఆయన రాష్ట్రానికి నూతన పరిశ్రమలు ఎలా తీసుకొస్తారంటూ నిప్పులు చెరిగారు.