Begin typing your search above and press return to search.

బాబుకు గృహ‌ప్ర‌వేశం మీద ఫైర్‌ బ్రాండ్ సూటిప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   13 April 2017 6:31 AM GMT
బాబుకు గృహ‌ప్ర‌వేశం మీద ఫైర్‌ బ్రాండ్ సూటిప్ర‌శ్న‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టైం బాగోలేదు. ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న అడ్డంగా బుక్ అవుతున్నారు. శుభ‌మా అని కొడుక్కి మంత్రి ఉద్యోగం ఇప్పించుకుంటే.. అదెంత ర‌చ్చ అయ్యిందో తెలిసిందే. ఈ ర‌చ్చ‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం స‌టైర్లు వేసే ప‌రిస్థితి. ఇది ఇక్క‌డితో ఆగిందా? పాలు.. పెరుగు.. కందిప‌ప్పు.. చింత‌పండు అమ్ముకునే వ్యాపారం చేసే బాబు ఫ్యామిలీ క‌ట్టుకోక‌.. క‌ట్టుకోక ఇంద్ర‌భ‌వ‌నం ఒక‌టి క‌ట్టేస్తే.. అదెంత ర‌చ్చ‌గా మారిందో తెలిసిందే. ఇంటిని క‌ట్టుకున్న దాని కంటే.. ఇల్లు య‌వ్వారాన్ని గుట్టుగా దాచేసిన వైనంపైనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గ‌తంలో జ‌గ‌న్ ఇంటి గురించి అవాకులు చ‌వాకులు పేలేసిన వైనాన్ని మ‌ర్చిపోయి.. ఆ విమ‌ర్శ‌ల‌కు భిన్నంగా పే..ద్ద ఇంటిని.. విలాస‌వంతంగా నిర్మించ‌టంపై బాబు తీరును ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్నారు.

ఎవ‌రినైనా విమ‌ర్శించేట‌ప్పుడు నీతులు చెప్పే చంద్ర‌బాబు.. త‌న దాకా వ‌చ్చేస‌రికి మాత్రం మ‌ర్చిపోవ‌టం ఇదేం మొద‌టిసారి కాదు. ఎప్ప‌టిలానే ఆయ‌న ఇంటి విష‌యంలో తాను చెప్పే నీతుల్ని.. చేత‌ల్లో చేయ‌లేద‌ని చెప్పాలి. ఇంటిపై సాగుతున్న ర‌చ్చ‌ను మ‌రో మెట్టుకు తీసుకెళ్లేలా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఏపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా. సూటిగా సుత్తి లేకుండా పాయింట్‌ లోకి వెళ్లేసి.. మాట్లాడే రోజా సంధించిన సందేహాలు బాబు ఇంటి ముచ్చ‌ట‌పై ఆయ‌న్ను మ‌రింత ఇరుకున ప‌డేసేలా చేశాయ‌ని చెప్పాలి.

బాబు క‌ట్టించుకున్న విలాస‌వంత‌మైన ఇంటిని నిర్మించుకోవ‌టానికి అయిన ఖ‌ర్చుపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ప‌వ‌ర్‌లోకి వ‌చ్చిన మూడేళ్లు అవుతున్నా పేదోడికి ఒక్క ఇంటిని నిర్మించని ముఖ్య‌మంత్రి.. కోట్లాది రూపాయిల‌తో విలాస‌వంత‌మైన ఇంటిని నిర్మించుకోవ‌టం ఏమిటంటూ సందేహాన్ని వ్య‌క్తం చేశారు. గ‌తంలో జ‌గ‌న్‌ పై అన‌వ‌స‌ర విమ‌ర్శ‌లు చేసిన చంద్ర‌బాబు.. ఈ రోజు తాను క‌ట్టించుకున్న ఇంటి గృహ‌ప్ర‌వేశానికి ఎందుకు ఎవ‌ర్ని పిల‌వ‌లేద‌న్న ఆమె.. త‌న‌కు వాచీ.. ఉంగరం లేద‌న్న బాబు ఇల్లు ఎలా క‌ట్టార‌ని నిల‌దీశారు. ప‌ట్టిసీమ‌.. రాజ‌ధాని నిర్మాణం పేరుతో దోచుకున్న డ‌బ్బుతో జూబ్లీహిల్స్ లో ఇల్లు క‌ట్టుకున్నార‌న్నారు.

నాటి వైస్రాయ్ నుంచి నేటి వ‌ర‌కూ చంద్ర‌బాబు నీచ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తిన ఆమె.. ఆరునెల‌ల వ్య‌వ‌ధిలో బాబు కుమారుడు లోకేశ్ ఆస్తులు 22 రెట్లు ఎలా పెరిగాయ‌ని ప్ర‌శ్నించిన రోజా.. దేశంలో పాలు.. కూర‌గాయ‌లు అమ్మేవాళ్లు చాలామందే ఉన్నా.. ఒక్క చంద్ర‌బాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ సంస్థ మాత్ర‌మే పెర‌గ‌టం ఏమిటంటూ విస్మ‌యాన్ని వ్య‌క్తం చేశారు. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల్ని అడ‌గ‌టంలో టీడీపీ ఎంపీలు ఫెయిల్ అయ్యార‌ని.. రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో క‌నీసం పాల్గొన‌కుండా డుమ్మా కొట్టార‌ని.. ఇలాంటి ఎంపీల‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు. నిత్యం మీడియాతో గంట‌ల గంట‌లు మాట్లాడే.. చంద్ర‌బాబు రోజా సంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తే బాగుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/